దీపావళి ఆదాయానికి కరోనా ‘గండి’

ABN , First Publish Date - 2020-11-16T04:05:35+05:30 IST

దీపావళి ఆదాయానికి కరోనాతో గండి పడింది. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తరువాత తాజాగా జరిగిన దీపావళి వరకూ అన్ని పండుగలపైనా కరోనా ప్రభావం పడింది. దీంతో పండుగలు ఆనందోత్సాహంగా జరుపుకోలేకపోవడం ఒక ఎత్తైతే.. పండుగ ద్వారా ప్రభుత్వానికి, వ్యాపారులకు వచ్చే ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది.

దీపావళి ఆదాయానికి   కరోనా ‘గండి’

గత ఏడాదితో పోల్చితే 50 శాతమే ఆదాయం 

గ్రీన దీపావళి ప్రభావమూ కారణమే

(విజయనగరం క్రైం) 

దీపావళి ఆదాయానికి కరోనాతో గండి పడింది. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తరువాత తాజాగా జరిగిన దీపావళి వరకూ అన్ని పండుగలపైనా కరోనా ప్రభావం పడింది. దీంతో పండుగలు ఆనందోత్సాహంగా జరుపుకోలేకపోవడం ఒక ఎత్తైతే.. పండుగ ద్వారా ప్రభుత్వానికి, వ్యాపారులకు వచ్చే ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది.

హిందూ సాంప్రదాయంలో దీపావళి పండుగకు అత్యంత ప్రాధాన్యం ఉంది. నిరుపేద, పేద, మధ్యతరగతి, ధనిక వర్గం అన్న తారతమ్యం లేకుండా అందరూ ఉత్సాహంగా.. కనువిందుగా దీపావళి జరుపుకుంటారు. ఆనందంగా బాణసంచా కాల్చుతుంటారు. ఈ క్రమంలో దీపావళి పండుగకు విజయనగరంలో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది.  హోల్‌సేల్‌ అమ్మకాలు ఎక్కువ. ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విశాఖపట్టణం) జిల్లాల నుంచి కూడా వ్యాపారులు, ప్రజలు విజయనగరం వచ్చి బాణాసంచా కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే విజయనగరంలో ఒక్క దీపావళి పండుగకే కాక.. ఏడాది పొడవునా కేఎల్‌పురంలో బాణాసంచా విక్రయించేందుకు ప్రభుత్వం కొన్ని దుకాణాలకు అనుమతి ఇచ్చింది. ఏడాది మొత్తంలో వ్యాపారం అంతగా లేకపోయినా.. దసరా పండుగ దాటిన తరువాత బాణసంచా విక్రయాలు విజయనగరంలో ఊపందుకుంటాయి. దసరా పండుగ వెళ్లిన మరుసటి మంగళవారం జరిగే పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. సిరిమానోత్సవం ముగిసిన తరువాత ఎక్కువ మంది దీపావళి పండుగకు సంబంధించి బాణా సంచా కొనుగోలు చేసుకుని తమ, తమ ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అందుకే దసరా నుంచి దీపావళి  వరకు బాణా సంచా వ్యాపారానికి సంబంధించి దాదాపు 20 నుంచి 30 శాతం అమ్మకాలు జిల్లా కేంద్రంలోనే జరుగుతుంటాయి. దీపావళికి వారం ముందు నుంచి ఈ వ్యాపారం మరింత ఊపందుకుంటుంది.


గత ఏడాదితో పోల్చితే.. 

జిల్లాలో దీపావళి కోసం బాణసంచా విక్రయించేందుకు 79 దుకాణాలు వెళిశాయి. ఇవి కాకుండా ఏడాది పాటు  విక్రయించే షాపులు పది(కేఎల్‌పురం) ఉన్నాయి. తాత్కాలిక షాపుల విషయానికి వస్తే విజయనగరం- 37, గజపతినగరం- 4, చీపురుపల్లి-2, బొబ్బిలి-3, పార్వతీపురం- 7, ఎస్‌.కోట-14, కొత్తవలస-6, గుమ్మలక్ష్మీపురం-1, సాలూరు-1, బాడంగి-4 షాపులు ఉన్నాయి. వీటి ద్వారా గత ఏడాది కోటి రూపాయల మేర వ్యాపారం జరిగింది. ఈ ఏడాది 50 లక్షల వరకూ జరిగిందని అంచనా. దీపావళి బాణసంచా విక్రయాలకు సంబంధించి గత ఏడాది  ప్రభుత్వానికి జీఎస్‌టీ రూపేణా 8 లక్షల 30 వేలు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది దాదాపు రూ. 5 లక్షలు మాత్రమే సమకూరింది. ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చిన 79 షాపుల ద్వారా విక్రయాలు జరిగిన దానికే ప్రభుత్వానికి పన్ను చేరుతుంది. కాగా పండుగ ముందు రోజు, దీపావళి రోజున గల్లీ, గల్లీలో షాపులు వెలుస్తాయి.. కొంత మంది ఫుట్‌పాత వ్యాపారులు, తోపుడుబళ్ల వ్యాపారులు కూడా ఆ రెండు రోజులు బాణసంచా విక్రయిస్తుంటారు. వీరు ప్రభుత్వానికి ట్యాక్స్‌ చెల్లించరు. ఏదైనాగాని కరోనా ప్రభావం, గ్రీన దీపావళి జరుపుకోవాలని అధికారులు ఇచ్చిన పిలుపుతో జిల్లాలో ఈ ఏడాది 50 శాతం మాత్రమే దీపావళి వ్యాపారం జరిగిందని వ్యాపార వర్గాలు తెలిపాయి.


Updated Date - 2020-11-16T04:05:35+05:30 IST