రూ.2కోట్లు ఎక్కడ?

ABN , First Publish Date - 2020-04-05T10:10:06+05:30 IST

కరోనా నియంత్రణకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులకు..

రూ.2కోట్లు ఎక్కడ?

కరోనా నిధులు ఏమవుతున్నట్టో...

లెక్కలు చెప్పని అధికారులు

స్వచ్ఛంద సాయం వివరాలూ వారికే ఎరుక

సమీక్షించని జిల్లా ప్రత్యేకాధికారి


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులకు...సిబ్బందికి మాస్కులు లేవు. శానిటైజర్లు లేవు. నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులకూ ఎటువంటి రక్షణ పరికరాలు అందలేదు. క్వారంటైన్‌ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు లేవు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ ఆస్పత్రిలోనూ అరకొర సౌకర్యాలే. మరోవైపు కరోనా నియంత్రణ చర్యలకు జిల్లాకు రూ.రెండు కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఆ నిధులు ఏమవుతున్నాయి? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? అంత మొత్తం నిధులు ఉంటే.. అత్యవసర సేవలు అందిస్తున్న వివిధ విభాగాల వారు ఏమాత్రం సౌకర్యాలు లేకుండా పని చేయాల్సిన దుస్థితి ఎందుకు దాపురించింది?..ఇవీ ప్రస్తుతం వివిధ వర్గాల వారిని తొలిచేస్తున్న ప్రశ్నలు. 


కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అటు అధికారులు.. ఇటు ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలిచ్చినట్టే. ఇప్పటి వరకూ ఎటువంటి ఆందోళనకర పరిస్థితి తలెత్తలేదు. ఇది అందరూ సంతోషించే విషయమే. ప్రజలు స్వీయ నియంత్రణ బాగా పాటిస్తున్నారు. ఎటొచ్చీ అధికారుల పరంగా తీసుకుంటున్న చర్యలే పూర్తి సంతృప్తిగా లేవు. ఇదే సమయంలో కరోనా నియంత్రణ చర్యలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏమవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆసుపత్రుల్లో వసతులు చూస్తే అంతంతమాత్రంగా కనిపిస్తున్నాయి. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం జిల్లాకు రూ.2కోట్లు వచ్చినట్లు సమాచారం. దీనిపై కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ను వివరణ కోరగా స్పష్టంగా చెప్పడం లేదు. ‘రూ.రెండు కోట్లు వచ్చింది కదా’ అంటున్నారు. అంతకుమించిన వివరాలు చెప్పడం లేదు. ఈ నిధులు ఏం చేస్తున్నట్లు? జిల్లాలో 27 క్వారంటైన్‌ కేంద్రాలు  ఉన్నాయి.


వాటిలో ఏర్పాట్లు చూస్తే దయనీయంగా ఉన్నాయి. మాస్కులు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు, వెంటిలేటర్లు పూర్తిస్థాయిలో లేవు. పారిశుధ్య పనులూ అంతంతమాత్రమే. జిల్లా కేంద్రం సమీపంలోని మిమ్స్‌ ఆసుపత్రిని, జిల్లా కేంద్ర ఆసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించారు. ఎటువంటి  ప్రత్యేక ఏర్పాట్లు లేవు. మిమ్స్‌లో ప్రస్తుతం 15 లీటర్ల ఉచిత శానిటైజర్ల క్యాన్లు, డిస్‌ఇన్‌ఫెక్ట్‌ జెల్‌ ఒక లీటరు బాటిళ్లు ఐదు, హైపోక్లోరైట్‌ సెలూన్స్‌ 14 మాత్రమే ఉన్నాయి. వెంటిలేటర్లు సైతం అరకొరగానే ఉన్నాయి. 


మాస్కులు ఏవీ?

మాస్కులు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు, వెంటిలేటర్లు తగినన్ని సిద్ధం చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సంబంధిత ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా ఇంకా కొనుగోలు చేయాల్సి ఉందని చెబుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేతకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. దీంతో కొనుగోలు చేస్తున్నట్లా? లేదా అన్నది తెలియరాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో పాజిటివ్‌ కేసులు లేని కారణంగా వైద్య పరికరాలు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్‌లు కొనుగోలు చేయకుండా కాలం వెల్లబుచ్చుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.


దీనికి తోడు స్వచ్ఛందంగా అనేక మంది ముందుకు వచ్చి నిధులు అందిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యాపార, వాణిజ్యరంగాల వారు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ముందుకు వచ్చి భారీ ఎత్తున అధికారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇవి కోట్లలోనే ఉంటున్నాయి. ఈ నిధులు ఏమవుతున్నట్లో స్పష్టత ఉండటం లేదు. ఎప్పటికపుడు వస్తున్న నిధులపై సామాజిక అడిట్‌ రూపంలో బులెటెన్‌ విడుదల చేస్తే ప్రజలకు కూడా స్పష్టత ఉంటుంది. ఆ పరిస్థితి లేదు. 


మొదటి నుంచీ వెనుకంజే..

ఏదైనా విపత్తు పొంచి ఉందంటే అధికార యంత్రాంగం ముందుగానే ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి. కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. దీనికి తగ్గట్టు అధికారులు సన్నద్ధం కాలేదు. కావాల్సిన స్థాయిలో సమీక్షలు నిర్వహించి అన్ని రంగాల్లో ముందుస్తు వ్యూహాన్ని తయారు చేసుకోవడంలో వెనకబడ్డారు. కూరగాయలకు, నిత్యావసర సరకులకు ఇబ్బందులు ఎదురైతేనే తప్ప స్పందించడం లేదు. వీటి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా మార్కెట్‌ వర్గాలతో సమావేశాల్ని ఏర్పాటు చేసి జేసీ మాట్లాడారు.


కూరగాయల విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాక మాత్రమే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ కారణంగా అరటి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.  రైతులు ఆందోళన వ్యక్తం చేశాక ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అరటి, మామిడి కాయల రవాణా విషయంలో చర్యలు చేపట్టారు. ఇలా ప్రతి విషయంలోనూ జిల్లా యంత్రాంగం ముందస్తు నిర్ణయాలు తీసుకోవడంలో వెనకబడుతోంది. ఇబ్బందులు ఎదురయ్యాక మాత్రమే స్పందిస్తున్నారు. ఈలోగా ప్రజలకు నష్టం జరిగిపోతోంది. 


సమీక్షించని జిల్లా ప్రత్యేకాధికారి

ఇదిలా ఉండగా జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణ ఏర్పాట్ల పర్యవేక్షక ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం వివేక్‌ యాదవ్‌ను నియమించింది. అయన ఇంతవరకు కలెక్టర్‌ కార్యాలయానికి కూడా రాలేదు. జిల్లాకు ఈనెల 2న ఒక పర్యాయం వచ్చి కొవిడ్‌ వైద్య శాలగా ఏర్పాటు చేసిన నెల్లిమర్ల మిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లి ఏర్పాట్లు చూసి వెళ్లారు. అక్కడ అరకొర వెంటిలేటర్స్‌, మాస్కులు, గ్లౌజ్‌లు దర్శనమిచ్చినా ప్రత్యేక అధికారి పరిశీలించి వెళ్లిపోయారు.


ఇంతవరకు మొత్తం పరిస్థితిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష కూడా నిర్వహంచలేదు. ముఖ్య శాఖలుగా ఉన్న వైద్య ఆరోగ్య, పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులతోనూ ప్రత్యేకంగా మాట్లాడలేదు. జిల్లాలో వైరస్‌ కదలికలు ఉన్నాయా? ఇతర దేశాల నుంచి వచ్చిన వారెవరు? క్వారంటైన్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కొవిడ్‌ ఆసుపత్రుల పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై ఇప్పటివరకు సమీక్ష లేదు. పరిస్థితిపై సమీక్షించి అవసరానికి తగ్గట్లు ప్రభుత్వం నుంచి సాయం రాబట్టాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారిదే. సమీక్ష లేక పరిస్థితి తెలుసుకోవడమే గగనంగా మారింది. 


Updated Date - 2020-04-05T10:10:06+05:30 IST