మాన్సాస్‌ విచ్ఛిన్నానికి కుట్ర

ABN , First Publish Date - 2020-12-31T05:28:48+05:30 IST

మాన్సాస్‌ను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని... రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ‘భూ నాటకంలో’ మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ సంచయిత ఒక పాత్రధారి మాత్రమేనని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. జిల్లాకు బుధవారం వచ్చిన ఆయన టీడీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు

మాన్సాస్‌ విచ్ఛిన్నానికి కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

 

ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న 

విజయనగరం రూరల్‌, డిసెంబరు 30: మాన్సాస్‌ను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని... రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ‘భూ నాటకంలో’ మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ సంచయిత ఒక పాత్రధారి మాత్రమేనని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. జిల్లాకు బుధవారం వచ్చిన ఆయన టీడీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు ఇనచార్జిగా బాధ్యతలు తీసుకున్న సాయిరెడ్డి భూములు కొల్లగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మాన్సాస్‌కి విలువైన భూములు ఉన్న నేపథ్యంలో దానిపై దృష్టి కేంద్రీకరించారని అన్నారు. ఈ నేపథ్యంలోనే సంచయితను రంగంలోకి దించి.. ఆ వెనుక నుంచి భూములు కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మాన్సాస్‌ సంస్థ ఏర్పాటు చేసింది ప్రజల కోసమని... ఇక్కడ జరుగుతున్న భూ బాగోతాన్ని అడ్డుకోవాల్సింది కూడా ప్రజలేనని పిలుపునిచ్చారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణలు విజయసాయిరెడ్డికి అన్ని విధాలా సాయం అందిస్తున్నారని చెప్పారు. మాన్సాస్‌ పుట్టింది కోటలోనని, అటువంటి కోటలోని కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభంకు తరలిస్తుండడం వెనుక కుట్ర ఉందన్నారు. చీకటి జీవోల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. స్టేలు ఇస్తోందని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి, సాయిరెడ్డిలకు గౌరవం లేదన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. వివిధ కేసుల్లో ఏ-1, ఏ-2లుగా ఉన్న జగన్మోహనరెడ్డి, సాయిరెడ్డిలకు అక్రమాలకు, అవినీతికి పాల్పడడం అలవాటేనని ధ్వజమెత్తారు.  పార్టీ వ్యవహారాల విషయమై ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ఇనచార్జిగా తాను జనవరి 18న బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, సువ్వాడ రవిశేఖర్‌, కంది చంద్రశేఖర్‌,  కరణం శివరామకృష్ణ, బొద్దుల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T05:28:48+05:30 IST