-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Confusion with crime
-
నేరాలతో కలవరం
ABN , First Publish Date - 2020-12-31T05:27:23+05:30 IST
ఓవైపు కరోనా జిల్లాను వణికించింది. మరోవైపు నేరాలూ అదే స్థాయిలో జిల్లా వాసులను ఈ ఏడాది భయపెట్టాయి. ముఖ్యంగా హత్యలు... అపహరణ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా కాలంలోనూ హత్యలు.. కిడ్నాప్‌లు
చోరీలూ అధికమే
సొత్తు రికవరీ అంతంతే
ఓవైపు కరోనా జిల్లాను వణికించింది. మరోవైపు నేరాలూ అదే స్థాయిలో జిల్లా వాసులను ఈ ఏడాది భయపెట్టాయి. ముఖ్యంగా హత్యలు... అపహరణ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇంటి దొంగతనాలూ అదే స్థాయిలో ఉన్నాయి. వీటిని అరికట్టడంలో పోలీసులు కొంతమేరకు విఫలమయ్యారనే చెప్పాలి. నేరాల నియంత్రణపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఏడాది సంఘటనలు గుర్తు చేస్తున్నాయి.
(విజయనగరం క్రైం)
నేరాల అదుపునకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. అత్యాధునిక పద్ధతుల్లో వాటిని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చైతన్య సదస్సులతో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా నిత్యం ఎక్కడోచోట చోరీలు.. అత్యాచారాలు.. హత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చి 21 నుంచి పోలీసు యంత్రాంగమంతా కరోనా నియంత్రణ విధుల్లో ఉంది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలతో పాటు ఎస్పీ రాజకుమారి ప్రత్యేక అవార్డులు అందుకున్నారు.
పెరిగిన హత్యలు
హత్యలు, కిడ్నాప్‌లు, ఇంటి దొంగతనాలు ఈ ఏడాది పెరిగాయి. కిడ్నాప్ కేసుల ఛేదనలో పురోగతి ఉన్నప్పటికీ.. హత్యలు, ఇంటి దొంగతనాల కేసుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. చోరీ సోత్తు స్వాధీనం అంతంతమాత్రమే. ఈ ఏడాదిలో 29 హత్యలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే కాస్త పెరిగాయి. హత్యల్లో కూడా వివాహేతర సంబంధాలు, భూ వివాదాలతో ఎక్కువ చోటుచేసుకున్నాయి. చాలాకాలంగా జిల్లాలో ఈ తరహా హత్యలే ఎక్కువ జరుగుతున్నాయి. మానసిక పరివర్తన కొరవడి.. ఆస్తుల యావతోనూ ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారు.
నిందితుల జాడేదీ?
కొన్ని హత్యల మిస్టరీ ఏళ్లుగా వీడడం లేదు. ఈ విషయంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారన్న విమర్శ ఉంది. కిడ్నాప్‌ల విషయాన్ని తీసుకుంటే.. గత ఏడాది 19 జరగ్గా... ఈ ఏడాది 27కి పెరిగాయి. ఇంటి దొంగతనాలు జిల్లాలో గత ఏడాది కంటే పెరిగాయి. గత ఏడాది ఇంటి దొంగతనాలు 97 జరగ్గా, ఈ ఏడాది 111కు చేరాయి. ఒక విధంగా దొంగలు.. పోలీసులకు సవాల్ విసురుతున్నారని చెప్పాలి. పోయిన సొత్తు తిరిగి స్వాధీనం చేసుకోవడంలో గత ఏడాది కంటే ఈ ఏడాది కాస్తంత మెరుగు కనిపించింది. చోరీ సొత్తు స్వాధీనం 62 శాతంగా ఉంది. గత ఏడాది 57 శాతంగా నమోదైంది.
తగ్గిన రోడ్డు ప్రమాదాలు
గత ఏడాదితో పోల్చితే రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. పోలీసులు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చాయనే చెప్పాలి. ప్రమాదాల నివారణకు బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు, జాతీయ రహదారులపై హైవే మొబైల్ వాహనాల సంచారం, ప్రతి పోలీసుస్టేషన పరిధిలో అవగాహనతో కూడిన స్టిక్కర్ల అతికింపు తదితర చర్యలు తీసుకున్నారు. గత ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 283 మంది ప్రాణాలు కోల్పోగా.. 625 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది 223 మంది మరణించగా... 507 మంది గాయాలపాలయ్యారు. మద్యం తాగి... వాహనాలు నడిపే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతోనే రోడ్డు ప్రమాదాల సంఖ్య ఈ ఏడాది తగ్గింది.
ఈ ఏడాది సంఘటనలు ఇలా
వివిధ కేసులు గత ఏడాది ఈ ఏడాది
అత్యాచారాలు 79 65
మోసాలు (చీటింగ్) 124 82
దొంగనోట్లు 1 1
హత్యాయత్నాలు 13 16
కొట్లాటలు 26 6
========================