వ్యవసాయ సలహా కమిటీలు.. చైర్మన్లుగా ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2020-06-25T21:50:01+05:30 IST

ఏ సీజన్‌లో ఏ పంట లాభదాయకం?.. ఏ విత్తనం వాడాలి?.. సాగునీరు అందుతోందా? లేదా?.. పంట మార్కెట్‌ చేయడం ఎలా? మద్దతు ధర దక్కకపోతే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు పరిష్కారాలను చూపుతూ అన్నదాతలకు అండగా

వ్యవసాయ సలహా కమిటీలు..  చైర్మన్లుగా ఎమ్మెల్యేలు

వ్యవ‘సాయానికి’! 

సలహా మండళ్ల ఏర్పాటులో యంత్రాంగం

జిల్లా స్థాయిలో మంత్రికి అవకాశం


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): ఏ సీజన్‌లో ఏ పంట లాభదాయకం?.. ఏ విత్తనం వాడాలి?.. సాగునీరు అందుతోందా? లేదా?.. పంట మార్కెట్‌ చేయడం ఎలా? మద్దతు ధర దక్కకపోతే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు పరిష్కారాలను చూపుతూ అన్నదాతలకు అండగా ఉండాలన్న లక్ష్యంతో కొత్తగా వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయ శాఖ యంత్రాంగం ఈ కమిటీల ఏర్పాటు పనుల్లో నిమగ్నమై ఉంది. మండల స్థాయిలో సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్‌గా వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా మంత్రి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటవుతుంది. కొన్ని మండలాల్లో కమిటీల ఏర్పాటుకు సంబంధించి కసరత్తు చివరి దశకు చేరింది. ఎమ్మెల్యేలు అందుబాటులో లేని మండలాల్లో కమిటీలు ఏర్పాటు కావాల్సి ఉంది. జిల్లాలోని 34మండలాల్లో 34 మండల వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటవుతాయి. మంత్రి చైర్మన్‌గా జిల్లా కమిటీ ఉంటుంది. మండల కమిటీకి సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. నియోజకవర్గాల్లో ఉన్న మూడు లేదా నాలుగు మండలాల్లోని కమిటీలన్నింటికీ ఆ ఎమ్మెల్యే అధ్యక్షునిగా ఉంటారు. మండల పరిషత్‌ అధ్యక్షుడు ఉపాధ్యక్షునిగా ఉంటారు. ప్రస్తుతం ఎంపీపీలు లేని కారణంగా మండల ప్రత్యేక అధికారులు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. వ్యవసాయాధికారి కన్వీనర్‌గా ఉంటారు. ఎంపీడీవో, తహసీల్దార్‌, హార్టీకల్చర్‌, సెరీకల్చర్‌ అధికారులు, నీటిపారుదల శాఖ ఏఈ, ఎలక్ర్టికల్‌ ఏఈ, మంచి దిగుబడులు సాధిస్తున్న ఐదుగురు రైతులు సభ్యులుగా ఉంటారు. 


 భారీగా జిల్లా కమిటీ

జిల్లా స్థాయిలో మాత్రం వ్యవసాయ సలహా మండలి భారీగా ఏర్పాటు కానుంది. మంత్రి కమిటీకి చైర్మన్‌గా ఉంటారు.  కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. జెసీ (రైతు భరోసా) కన్వీనర్‌గా ఉంటారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు సభ్యులుగా ఉంటారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ, ఎలక్ట్రికల్‌ ఎస్‌ఈ, వ్యవసాయ శాఖ జేడీ, హార్టీకల్చర్‌, సెరీ కల్చర్‌ డీడీలు, మార్కెట్‌ కమిటీ ఏడీ, మార్కోఫెడ్‌, ఏపీ సీడ్స్‌ జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. నాబార్డు జిల్లా మేనేజర్‌, ఎల్‌డీఎం, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు సభ్యులుగా ఉంటారు. 10మంది ఉత్తమ రైతులనూ సభ్యులుగా తీసుకుంటారు. 


రైతులకు సూచనలు

మండల కమిటీలు రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సూచనలు.. సలహాలు ఇస్తాయి. వాటిని జిల్లా కమిటీ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ప్రభుత్వానికి చేరవేస్తాయి. రైతులు పండించే పంటలు, మార్కెటింగ్‌ అవకాశాలపై చర్చిస్తాయి. లాభదాయకమైన పంటలు వేసేందుకు వీలుగా సూచిస్తాయి. ఆహార భద్రత, స్వయం సమృద్ధి సాధించే విధంగా చర్యలు తీసుకుంటాయి. పంట నష్టాలొస్తే రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటాయి. వ్యవసాయ సలహా కమిటీల విషయాన్ని వ్యవసాయ శాఖ జేడీ వద్ద ప్రస్తావించగా కమిటీల ఏర్పాటు పూర్తి కావస్తోందని చెప్పారు.

Updated Date - 2020-06-25T21:50:01+05:30 IST