కరోనా నియంత్రణకు సహకరించండి

ABN , First Publish Date - 2020-07-15T09:31:30+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దశలో నియంత్రణకు ప్రైవేటు వైద్యులు సహకరించాలని కలెక్టరు హరిజవహర్‌లాల్‌ కోరారు.

కరోనా నియంత్రణకు సహకరించండి

ప్రైవేటు వైద్యులతో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌


కలెక్టరేట్‌, జూలై 14: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దశలో నియంత్రణకు ప్రైవేటు వైద్యులు సహకరించాలని కలెక్టరు హరిజవహర్‌లాల్‌ కోరారు.  కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఐఎంఏ(ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌) ప్రతినిధులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో కరోనా నియంత్రణకు ప్రైవేటు వైద్యుల సేవలే కీలకం కానున్నాయని చెప్పారు. జిల్లాలో కరోనా చికిత్సకు అవసరమైన వనరులు సిద్ధంగా ఉన్నాయని, అయితే వైద్యులు కొరత ఉందన్నారు. యువ వైద్యులను బృందాలుగా ఏర్పాటు చేసి వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో రోజుకు రెండు వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వెంటనే వాటి ఫలితాలు తెలియజేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి, ప్రైమరీ కాంటాక్ట్స్‌ వ్యక్తులకు, కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్నవారికి, విషమంగా ఉన్నవారికి, ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొవిడ్‌ పరీక్షల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కరోనా కేసులను గుర్తించి వెంటనే హోమ్‌ ఐసోలేషన్‌లో పెట్టి చికిత్స అందజేయాలన్నారు.


అలాగే వారిని కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ (3టి) పద్ధతిలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. భవిష్యత్‌లో కంటైన్‌మెంట్‌ జోన్లలో కఠినంగా నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. హోమ్‌ ఐసోలేషన్‌ ఉన్నవారి కోసం ప్రత్యేకంగా వైద్య సలహాలు అందజేస్తామని, ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరగకుండా , మరణాలు సంభవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో జేసీ (అభివృద్ధి) డాక్టరు మహేష్‌ కుమార్‌, డీఆర్‌వో వెంకటరావు, జిల్లా వైద్యాధికారి రవికుమార్‌, డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-15T09:31:30+05:30 IST