-
-
Home » Andhra Pradesh » Vizianagaram » cag serious
-
కడిగేసిన కాగ్
ABN , First Publish Date - 2020-12-07T03:31:21+05:30 IST
చెరువుల ఆక్రమణలు సరికాదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ప్రభుత్వానికి.. పాలకవర్గాలకు మొట్టికాయలు వేసింది. అధికారులు, ప్రభుత్వాధినేతలు, మున్సిపాలిటీల పాలకవర్గాలు అందరూ కలసి చెరువులపై పడుతున్నారని.. భవిష్యత్‌లో చెరువులు లేకుండా చేస్తున్నారని తీవ్రంగా తప్పుపట్టింది.

చెరువుల ఆక్రమణలపై ఆగ్రహం
పాలకవర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్న
లోపాలు ఎత్తిచూపుతూ ఉదాహరణలతో బయటపెట్టిన వైనం
విజయనగరంలో చెరువుల కబ్జాపై తీవ్ర అసహనం
చెరువుల ఆక్రమణలు సరికాదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ప్రభుత్వానికి.. పాలకవర్గాలకు మొట్టికాయలు వేసింది. అధికారులు, ప్రభుత్వాధినేతలు, మున్సిపాలిటీల పాలకవర్గాలు అందరూ కలసి చెరువులపై పడుతున్నారని.. భవిష్యత్‌లో చెరువులు లేకుండా చేస్తున్నారని తీవ్రంగా తప్పుపట్టింది. విజయనగరం జిల్లాకు సంబంధించి ఏఏ ప్రాంతాల్లో చెరువులు ఆక్రమించినదీ ఉదాహరణలతో పేర్కొంది. అర్బన్ లోకల్ బాడీల వైఫల్యాన్ని ఎండగట్టింది. ప్రస్తుతం పాలకవర్గాలు లేని కారణంగా ప్రత్యేక అధికారులకే ఇదంతా వర్తిస్తుంది.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వమే వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న పరిస్థితి జిల్లాలో కన్పిస్తోంది. ముఖ్యంగా మున్సిపాలిటీల పరిధిలో స్థలాల విలువ ఎకరం కోట్ల రూపాయల్లో ఉంటోంది. దీనిని గుర్తించిన అక్రమార్కులు చెరువు గర్భాలను ఆక్రమించుకుంటున్నారు. ఖాళీ స్థలాలపై గద్దల్లా పడుతున్నారు. ఈ అంశాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నిశితంగా పరిశీలించింది. విజయనగరంలో అనేక చెరువు గర్భాలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన వారు ఆక్రమించినట్లు గుర్తించింది. ఇది వాల్టా చట్టానికి విరుద్ధమని, చెరువులు ప్రకృతి సంపద అని చెప్పింది. వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. వాస్తవంగా ప్రభుత్వం కూడా ప్రజా ప్రయోజనం పేరుతో చెరువు గర్భాలను ఆక్రమించి ప్రభుత్వ భవనాలు, అవసరాలకు వినియోగిస్తోంది. ఇదే ఊతగా ప్రైవేట్ వ్యక్తులు కూడా రంగంలోకి దిగి ఇళ్ల నిర్మాణాలు చేపడుతూ దురాక్రమణకు పాల్పడుతున్నారు. మరికొందరు ఏకంగా రియల్ ఎస్టేట్ దందాలకు చెరువు గర్భాలను దోచేస్తున్నారు. వీటన్నింటినీ కాగ్ పరిశీలించి తప్పు పట్టింది. దీనిపై విజయనగరం కార్పొరేషన్ అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. కార్యాలయాలు, విద్యుత్ సంబంధిత పనుల కోసం చెరువు గర్భాల్లో కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పింది. కాగా విజయనగరం పట్టణం అతి వేగంగా విస్తరిస్తోంది. విశాఖ మహానగరం కూడా విజయనగరం వైపుగా విస్తరిస్తోంది. దీంతో భూములకు రెక్కలొస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందా మితిమీరుతోంది. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం ప్రాంతంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న వారిలో సాగానికి పైగా విజయనగరం నుంచే రాకపోకలు సాగిస్తునారు. ఈ విధంగా పట్టణం రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునే పనిలో అక్రమార్కులు ఉండగా ప్రభుత్వ చర్యలు కూడా అందుకు దోహదపడుతున్నాయి. పట్టణాలు విస్తరిస్తున్న కారణంగా వ్యవసాయ క్షేత్రాలు రియల్ ఎస్టేట్లుగా మారిపోతున్నాయి. ఆయకట్టు చెరువుల ఆవశ్యకత తగ్గుతోంది. దీనిని గుర్తించిన మున్సిపాలిటీలు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అవసరాలకు చెరువు గర్భాలను వినియోగిస్తున్నాయి.
ఆక్రమణలు ఇలా..
విజయనగరం నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువు అన్యాక్రాంతం అవుతోందని కాగ్ తన నివేదికలో స్పష్టంచేసింది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక భవనాలను నిర్మిస్తుండగా మరో వైపు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారని వివరించింది. చెరువు స్థలంలోనే విద్యుత్ సబ్‌స్టేషన్, కార్యాలయం నిర్మించినట్లు ఉదహరించింది. అలాగే మత్స్య శాఖ భవనం.. మురుగు నీరు శుద్ధి చేసే ప్లాంట్ నిర్మాణాలకు చెరువు గర్భాన్నే వినియోగిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా రైల్వేస్టేషన్ రోడ్డు వైపు ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు చెరువు గర్భంలోకి ఇళ్ల నిర్మాణాలు వచ్చేశాయని కూడా స్పష్టం చేసింది. చేపల ఉత్పత్తి కేంద్రం.. దీనిని ఆనుకుని ఉన్న వివిధ వ్యాపార సంస్థలు ఏడాదికేడాది చెరువు గర్భంలోకి చొచ్చుకుపోతున్నట్లు పేర్కొంది. వేసవిలో పెద్ద చెరువులో నీరు లేని సమయంలో చెరువు గర్భాన్ని మట్టి, డెబ్రీస్‌తో రాత్రి పూట నింపేస్తున్నారు. ఆ తరువాత చెరువులోకి ప్రహరీ కట్టేసి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. పెద్ద చెరువు గర్భంలో 9.59 ఎకరాలు వివిధ అవసరాలు, ప్రైవేట్ కబ్జాకు గురైనట్లు కాగ్ తేటతెల్లం చేసింది. అయ్య కోనేరు గట్టుపై గృహ నిర్మాణాలు జరిగాయని కూడా కాగ్ పేర్కొంది. మరోవైపు చెరువు గర్భంలోనే రోడ్డు నిర్మించినట్లు వెళ్లడించింది. ఈ విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ వర్గాలు చెరువు గర్భాన్ని వాడుకుంటున్నాయని పేర్కొంది. ఎర్రచెరువు గర్భాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్న విషయాన్నీ వెళ్లడించింది. దీనిపై ఇదివరకు ‘ఆంధ్రజ్యోతి’ పతాక శీర్షికన కథనాలు ప్రచురించింది. సింగపూర్ సిటీ రియల్ ఎస్టేట్ భవనాలను అనుకుని ఉన్న ఎర్రచెరువు గర్భం కోట్లు విలువ చేసేదిగా ఉంది. దీనిని పరిరక్షించడంలో మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగాలు విఫలమవుతున్నాయి.
మరిన్ని ప్రాంతాల్లో..
విజయనగరం పరిధిలోని బుడితి చెరువులో బహుళ అంతస్తు భవనాలు నిర్మితమవుతున్నా ఇటు మున్సిపల్ కార్పొరేషన్, అటు రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. కోమటి చెరువు గుర్భం కూడా నాలుగు ఎరకరాల మేర కబ్జాకు గురవుతున్నట్లు కాగ్ వెళ్లడించింది. విజయనగరం పరిధిలోని మలిచర్ల వద్ద చెరువు స్థలాన్ని శ్మశాన వాటికకు వినియోగిస్తున్నట్లు పేర్కొంది. పట్టణంలోని నల్ల చెరువు గర్భం అన్యాక్రాంతమైనట్లు వెళ్లడించింది. ఈ చెరువులో ప్రభుత్వం రోడ్డు వేసినట్లు తెలిపింది. దాలయ్యచెరువు, కిట్టన్న కోనేరు వంటి చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయని వెళ్లడించింది.
పరిరక్షణ చర్యలేవి?
పట్టణంలోని చెరువుల పరిరక్షణకు సమగ్ర వ్యూహం ఏదీ అమలు చేయడం లేదని కాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాటి పరిరక్షణకు కట్టుదిట్టమైన కార్యాచరణ అవసరమని గుర్తుచేసింది. చెరువు గర్భాలను వినియోగిస్తున్నపుడు మున్సిపల్ పాలకవర్గాల అనుమతుల తీర్మానాలు ఉన్నాయని చెప్పటం సరికాదని.. వాల్టా చట్టం ప్రకారం కమిటీ అనుమతి కూడా అవసరమని వెల్లడించింది. అంతే కాకుండా వాల్టా అథారిటీ కమిటీ ప్రతి మూడు నెలలకు సమావేశమై వివిధ అంశాలపై చర్చించాల్సి ఉందని గుర్తుచేసింది. జిల్లా స్థాయిలో వాల్టా అథారిటీ సమావేశాలు కన్పించడం లేదని నిరాశ వ్యక్తంచేసింది.