-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Break eye exams
-
కంటి పరీక్షలకు బ్రేక్!
ABN , First Publish Date - 2020-06-22T11:39:13+05:30 IST
నేత్ర సంబంధిత వ్యాధులపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకుగాను ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న

కరోనాతో నిలిచిపోయిన వైఎస్సార్ కంటి వెలుగు పథకం
ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది
(కొమరాడ): నేత్ర సంబంధిత వ్యాధులపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకుగాను ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రారంభమైన పథకం జూన్ 31 వరకూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కానీ కరోనా ఉధృతి నేపథ్యంలో మార్చి 16తో పథకం నిలిచిపోయింది. దీంతో నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్థేశించిన సమయం జూన్ 31 సమీపిస్తుండడంతో మళ్లీ పునరుద్ధరిస్తారో లేదో అన్న అనుమానం వారిని వెంటాడుతోంది.
గ్రామ సచివాలయాల వారీగా 60 ఏళ్ల పైబడిన వృద్ధులను ప్రాథమికంగా ఎంపిక చేశారు. సగటున రోజుకు 50 నుంచి 100 మందికి కంటి పరీక్షలు చేసేవారు. మార్చి 16 వరకూ ప్రక్రియ నిరాటంకంగా సాగింది. మొత్తం 6920 మందికి కంటి పరీక్షలు పూర్తిచేశారు. వీరిలో 3857 మందికి కంటి అద్దాలు అందజేశారు. 1615 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. కానీ కేవలం 348 మందికి మాత్రమే ఆదపరేషన్లు చేశారు. ఇంకా 1267 మందికి చేయాల్సి ఉంది. ఇంతలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో వీరంతా తమకు ఎప్పుడు శస్త్ర చికిత్సలు జరుగుతాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇటీవల లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులు వచ్చిన నేపథ్యంలో ఆపరేషన్లు పూర్తిచేయాలని కోరుతున్నారు.
అనుమతిస్తే కార్యక్రమం ప్రారంభం
కరోనా మహమ్మారి కారణంగా అవ్వ, తాతలకు కంటి పరీక్షలు నిలిపివేశాం. ప్రభుత్వం అనుమతిస్తే మరళా కార్యక్రమం ప్రారంభిస్తాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వృద్ధులకు ఈ పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం.