టిడ్కో ఇళ్లు అప్పగించండి

ABN , First Publish Date - 2020-12-04T04:18:18+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను అర్హులకు వెంటనే అప్పగించాలని టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు డిమాండ్‌ చేశారు. విజయనగరంలోని అశోక్‌ బంగ్లాలో గురువారం విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజతిరాజుతో కలసి మాట్లాడారు.

టిడ్కో ఇళ్లు అప్పగించండి
విలేకర్లతో మాట్లాడుతున్న కళావెంకట్రావు, పక్కన అశోక్‌గజపతిరాజు, కిమిడి నాగార్జున

అసెంబ్లీలో మంత్రుల తీరు సరికాదు

 టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు 

ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు: అశోక్‌ 

విజయనగరం రూరల్‌,  డిసెంబరు 3:  గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను అర్హులకు వెంటనే అప్పగించాలని టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు డిమాండ్‌ చేశారు. విజయనగరంలోని అశోక్‌ బంగ్లాలో గురువారం విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజతిరాజుతో కలసి మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని కళా వ్యాఖ్యానించారు. ఈ 18 నెలల పాలన కాలంలో ఈ ప్రభుత్వం ఏ వర్గానికీ న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. సెంటు స్థలం ఇస్తామని ప్రకటించారని... ఆ మాత్రం స్థలం ఇవ్వడానికి ఇంకా ముహూర్తం కుదరలేదా అని ఆయన ఎద్దేవా చేశారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వే పట్టాలు ఉన్న తీరుగా రాష్ట్ర ప్రభుత్వ ఇళ్ల స్థలాల పట్టాల ప్రక్రియ నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఏమీ చేయకపోయినా... బ్లూ మీడియా మాత్రం ఏదో జరిగినట్టు బూతద్దంలో చూపిస్తోందన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని... ప్రజలు వారిని గమనిస్తున్నారని కళా హెచ్చరించారు. 

మునుపెన్నడూ చూడలేదు 

తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు విమర్శించారు. శానససభ, శానసమండలిలో పాలకులు వ్యవహరిస్తున్న తీరు ఘోరంగా ఉందన్నారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎదురుదాడే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉండాలని.. ఈ ప్రభుత్వం రెండింటినీ విస్మరిస్తోందని అన్నారు. కరోనాపై కూడా ప్రభుత్వం దోబుచులాడుతోందని విమర్శించారు. సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జిలు పతివాడ నారాయణస్వామి నాయుడు, డాక్టర్‌ కేఏ నాయుడు, అదితి గజపతిరాజు, కిమిడి నాగార్జున, బేబినాయన, కోండ్రు మురళీ మోహన తదితరులు పాల్గొన్నారు. 

తక్షణమే సంస్థాగత ఎన్నికలు

తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన అసెంబ్లీ నియోజకవర్గ ఇనచార్జుల సమావేశం జరిగింది. గ్రామ, వార్డుస్థాయిలో కమిటీలతో పాటు, మండల, పట్టణ కమిటీలను తక్షణమే పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లా కమిటీలను కూడా వారం  రోజుల్లో పూర్తి చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు.

టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఐవీపీ రాజు 

 తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శిగా ఐవీపీ రాజుకు అవకాశం దక్కింది. తాజాగా ప్రధాన కార్యదర్శి పదవిని ప్రకటించారు. దీంతో ఐవీపీ రాజుకు మొత్తంగా పది పర్యాయాలు ఈ పదవి దక్కినట్లయింది. ఈ సందర్భంగా ఆయన్ను టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు,  పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు, నియోజకవర్గ ఇనచార్జిలు పతివాడ నారాయణస్వామి నాయుడు, డాక్టరు కేఏ నాయుడు, బేబి నాయన, అదితి గజపతిరాజు, కోండ్రు మురళీమోహన తదితరులు అభినందించారు. 



Updated Date - 2020-12-04T04:18:18+05:30 IST