‘మద్దతు’ ఏదీ? రైతుకు సరైన ధర అందేది ఎప్పుడో?
ABN , First Publish Date - 2020-12-14T05:27:45+05:30 IST
‘ధాన్యం సేకరణంతా పక్కగా జరగాలి.. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకూడదు’ అంటూ జిల్లా అధికారులు తరచూ చెప్పడం.. చివరికి వచ్చేసరికి పూర్వ పరిస్థితే నెలకొనడం మామూలైపోయింది. ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకూ 220 మెట్రిక్ టన్నులే సేకరణ
చాలా చోట్ల తెరవని కొనుగోలు కేంద్రాలు
కలెక్టరేట్, డిసెంబరు 13: ‘ధాన్యం సేకరణంతా పక్కగా జరగాలి.. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకూడదు’ అంటూ జిల్లా అధికారులు తరచూ చెప్పడం.. చివరికి వచ్చేసరికి పూర్వ పరిస్థితే నెలకొనడం మామూలైపోయింది. ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుకు అందాల్సిన మద్దతు ధర దక్కడం లేదు. ఇప్పటికీ జిల్లాలో చాలా మంది మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. అధికారులు ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా వారు ముందుకు రావడంలేదు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని అధికారులు ప్రకటించారు. 263 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం విక్రయించుకునే రైతులు ముందుగా ఇ-క్రాపు ఆధారంగా రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మందికి పైబడి రైతులు నమోదు చేసుకున్నట్లు అధికార గణంకాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం ధాన్యం పండించే రైతు నేరుగా కొంత శాంపిల్ ధాన్యం రైతు భరోసా కేంద్రానికి తీసుకువెళ్లి అక్కడ తేమ శాతం పరీక్షించుకోవాలి. అంతా పక్కాగా ఉంటే ఒక కూపన్ ఇస్తారు. అనంతరం బ్యాంకు, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకుని రైతు కళ్లం వద్దకు అధికారులు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలి. అక్కడ నుంచి కొనుగోలు కేంద్రం సిబ్బంది ధాన్యం తీసుకుని టాగ్ చేసిన మిల్లులకు ధాన్యం పంపించాలి. తరువాత రైతు ఖాతాకు బిల్లులు జమ అవుతాయి. అయితే ఈ నిబంధనలు పక్కాగా అమలు కావడం లేదు. కొనుగోలు కేంద్రాల నుంచి కాకుండా నేరుగా మిల్లర్లకు ధాన్యం చేరుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అధికార లెక్కల ప్రకారం ఇప్పటివరకూ దాదాపు 300 మెట్రిక్ టన్నులే సేకరించారు. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో దళారులు ప్రవేశించి రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపిస్తున్నట్లు సమాచారం. 80 కేజీల బస్తాను రూ.1350కు కొనుగోలు చేస్తున్నారు.
దీనివల్ల రైతుకు బస్తా వద్ద రూ.150 నుంచి రూ.200 వరకూ నష్టపోతున్నాడు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని బలిజిపేట మండలానికి చెందిన రైతులు, సంఘ నాయకులు ఇటీవల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రసుత్తం క్వింటా సాధారణ రకం రూ.1860, గ్రేడ్-1 రూ.1880 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ధాన్యం తీసుకునే మిల్లరు ముందుగా బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాలి. జిల్లా వ్యాప్తంగా 180 మంది మిల్లర్లు ఉన్నారు. ఇప్పటి వరకూ 34 మంది మిల్లర్లు రూ.19.5 కోట్లకే బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చినట్లు అధికార గణంకాలు చెబుతున్నాయి. ఏదేమైనా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యం సేకరించాలని రైతులు కోరుతున్నారు.
పక్కాగా కొనుగోలు చేస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలును పక్కాగా చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు ధాన్యం ఇచ్చుకోవాలి. ప్రతి రైతుకు మద్దతు ధర అందజేయడం కోసం చర్యలు తీసుకున్నాం. జిల్లా వ్యాప్తంగా 263 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకూ 220 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 34 మంది మిల్లర్లు రూ 19.5 కోట్లకు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారు. అంతా నిబంధనలు ప్రకారం కొనుగోలు చేస్తున్నాం.
- వర కుమార్, డీఎం, సివిల్ సప్లయ్ శాఖ