ఏనుగు సంచారంతో ఆందోళన
ABN , First Publish Date - 2020-11-16T04:54:53+05:30 IST
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఏనుగు సంచరించడంతో ప్రజలు ఆందోళనకు లోనయ్యారు.

పంటలకు తీవ్ర నష్టం
గరుగుబిల్లి, నవంబరు 15: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఏనుగు సంచరించడంతో ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. కొమరాడ మండలం పరు శురాంపురంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన ఒంటరి ఏనుగు ఈ ప్రాంతానికి రావడం తో భయాందోళన చెందుతున్నారు. రైతులు పంట పొలాల వైపు వెళ్లరాదని కురుపాం రేంజర్ మురళీకృష్ణ, గరుగుబిల్లి తహసీల్దార్ వీవీ సన్యాసిరావు ఖడ్గవలస, నాగూరు, చిలకాం, తురకనాయుడువలస, దత్తివలస, పిట్టలమెట్ట, కారివలస, రావివలస, నంది వానివలస, తోటపల్లి, గిజబ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో దండోరా వేయిం చారు. ఖడ్గవలస ప్రాంతంలో మంత్రబుడ్డి చంద్రశేఖర్‌రావుకు చెందిన చెరకు తోటను ధ్వంసం చేసింది. గత కొన్నాళ్లుగా సంచరించిన ఏనుగుల కారణంగా పంట నష్టం సుమారు రూ. 3 లక్షలకు పైగా వాటిల్లిందని వాపోయారు. పరిహారం మంజూరులో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం వీరఘట్టాం సరిహద్దులకు ఏనుగును అటవీశాఖ సిబ్బంది తరలించారు.