గ్రేడింగ్‌పై ఉత్కంఠ!

ABN , First Publish Date - 2020-06-22T11:39:53+05:30 IST

కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించినట్టేనని ప్రకటించింది.

గ్రేడింగ్‌పై ఉత్కంఠ!

ఎఫ్‌ఏ, ఎస్‌ఏ ప్రాతిపదికగా తీసుకుంటే నష్టం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆందోళన


సాలూరు రూరల్‌, జూన్‌ 21: కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించినట్టేనని ప్రకటించింది. గ్రేడింగ్‌ ఇస్తామని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల రద్దు హర్షించదగ్గ పరిణామమే అయినా గ్రేడింగ్‌ ఏ విధంగా ఇస్తారన్న దానిపై విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. దీని వల్ల నష్టం జరిగే అవకాశముందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 30,369 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్టే. ప్రస్తుతం వీరంతా గ్రేడింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.


ఈ ఏడాది పదో తరగతికి అంతర్గత మార్కులు (20 మార్కుల ఇంటర్నల్‌), నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ), బిట్‌ పేపరు, మెయిన్‌, అడిషనల్‌ పద్ధతిని తొలగించారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలల్లో జరిగిన ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షల్లో మార్కులు వేయడంలో ఉపాధ్యాయులు అచితూచి వ్యవహరించారు. విద్యార్థులు రాసిన జవాబులను కచ్చితంగా మూల్యాంకనం చేసి మార్కులు వేశారు. పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులను అన్నివిధాలా సన్నద్ధం చేయడానికి కఠినంగా వ్యవహరించారు.  ప్రస్తుతం ఎఫ్‌ఏ,ఎస్‌ఏలను ప్రామాణికంగా తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గ్రేడింగ్‌లో వెనుకబడే అవకాశాలున్నాయి.


ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఎఫ్‌ఏ,ఎస్‌ఏలకు మార్కులు అధికంగానే వేస్తారని ప్రభుత్వ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. గ్రేడింగ్‌లో ఈ విధానమే అనుసరిస్తే ట్రిపుల్‌ ఐటీ తదితర సంస్థల ప్రవేశాల్లో ప్రభుత్వ విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశముందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  గ్రేడింగ్‌ నిర్ణయించడంలో సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2020-06-22T11:39:53+05:30 IST