పారిశుధ్యమే కీలకమని..

ABN , First Publish Date - 2020-06-26T11:56:26+05:30 IST

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పంచాయతీల్లో పారిశుధ్య చర్యలకు ఆదేశించారు.

పారిశుధ్యమే కీలకమని..

పనులు చేయిస్తున్న అధికారులు

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం


విజయనగరం(ఆంధ్రజ్యోతి), జూన్‌ 25: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పంచాయతీల్లో పారిశుధ్య చర్యలకు ఆదేశించారు. వర్షాకాలంలో సాధారణంగా మలేరియా, టైఫాయిడ్‌, ఇతర వైరల్‌ జ్వరాలతో పాటు పైలేరియా ప్రబలే అవకాశం ఎక్కువ. ఏటా జిల్లాలో అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది కరోనా ముప్పు పొంచి ఉండడంతో ఇతర వ్యాధులు దాడి చేయకుండా అధికారులు సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు పారిశుధ్య సిబ్బంది పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. మంచినీటి ట్యాంకుల్లో క్లోరిన్‌ స్ర్పే చేస్తున్నారు. కాలువల్లో పూడికతీయడం.. గ్రామాల్లోని చెత్తను దూరంగా తీసుకువెళ్లి పారబోయడం తదితర పనులు చేస్తున్నారు.


పూడికను ఎక్కువ గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. అదే విధంగా ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని జిల్లా అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం, పంచాయతీరాజ్‌ నిధులను ఇందుకోసం కేటాయించింది. జిల్లాలో 955 పంచాయతీల వారీగా ఈ నిధులను విడుదల చేశారు. ఇప్పటికే జిల్లాలోని 8 ఐటీడీఏ మండలాలతో పాటు 28 మెట్ట మండలాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నారు. బ్లీచింగ్‌తో పాటు, దోమల నిర్మూలనకు ఫాగింగ్‌ మిషన్లు సిద్ధం చేశారు.


పంచాయతీ రాజ్‌ శాఖతో పాటు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, వైద్య ఆరోగ్యశాఖలను భాగస్వామ్యులను చేసి దాదాపు నెల రోజుల పాటు ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 38 ట్రాక్టర్లు,  2,289, రిక్షాలు, 20 ఫాగింగ్‌ మిషన్‌లు, 25 డ్రైక్లీనింగ్‌ మిషన్లతో పాటు 2,363 మంది గ్రీన్‌ అంబాసిడర్లతో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. గ్రామాలకు దగ్గరగా ఉండే నీటికుంటలు, చెరువుల్లో దోమలు, ఈగల వ్యాప్తిని అరికట్టేందుకు గంబూషీయా చేపలను విడిచిపెడుతున్నారు.


పారిశుధ్యం మెరుగుకు చర్యలు

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా 955 పంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఇందుకోసం 14, 15వ ఆర్థిక సంఘం, పంచాయతీరాజ్‌ శాఖ నిధులను వినియోగిస్తున్నాం. 

- కె.సునీల్‌ రాజ్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ డీపీవో

Updated Date - 2020-06-26T11:56:26+05:30 IST