ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తం

ABN , First Publish Date - 2020-11-22T04:48:34+05:30 IST

ఆన్‌లైన్‌ మోసాలను అప్రమత్తతతోనే అడ్డుకోగలమని ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. అంతర్జాతీయ ఫ్రాడ్‌ అవేర్‌నెస్‌ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్‌ శాఖ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సంయుక్తంగా కంటోన్మెంట్‌లోని దేవి దండుమారమ్మ కల్యాణ మండపంలో శనివారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తం
సదస్సులో మాట్లాడుతున్న ఎస్పీ రాజకుమారి


జాగ్రత్తలతోనే అడ్డుకట్ట
ఎస్పీ రాజకుమారి
విజయనగరం క్రైమ్‌, నవంబరు 21:
ఆన్‌లైన్‌ మోసాలను అప్రమత్తతతోనే అడ్డుకోగలమని ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. అంతర్జాతీయ ఫ్రాడ్‌ అవేర్‌నెస్‌ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్‌ శాఖ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సంయుక్తంగా కంటోన్మెంట్‌లోని దేవి దండుమారమ్మ కల్యాణ మండపంలో శనివారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్‌ శాఖ అధికారులకు, స్వచ్ఛంద సంస్థల సభ్యులకు, యువతకు సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో ఎక్కువగా ఆన్‌లైన్‌ నగదు బదిలీలు, లావాదేవీలపై ఎక్కువ మంది ఆధారపడుతున్నారని గుర్తు చేశారు. ఇంటర్‌నెట్‌ వినియోగం పట్టణాల నుంచి పల్లెల వరకు విస్తరించిందన్నారు. అదేస్థాయిలో నకిలీ వెబ్‌సైట్లు విపరీతంగా పెరిగి... సైబర్‌ నేరగాళ్ల సంఖ్య అధికమైందని తెలిపారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా వ్యవహరించి, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పూర్తిగా భద్రత ఉన్న వెబ్‌సైట్ల యాప్‌లు వినియోగించాలన్నారు. నేరాలను ఛేదించే కంటే ముందు జాగ్రత్తలు పాటించి అప్రమత్తం కావడం మేలని చెప్పారు. ప్రజలు అత్యాశకు పోవద్దని, అనధికార లింకులను క్లిక్‌ చేయవద్దని అన్నారు. ఏటీఎం కార్డులను అవగాహనతో వినియోగించాలని సూచించారు. ఎస్‌ఎమ్‌ఎస్‌, ఫోన్‌కాల్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారని గుర్తుచేశారు. హెచ్‌డీఎఫ్‌సీ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ పట్నాయక్‌, అసిస్టెంట్‌ వైస్‌ ప్రసిడెంట్‌ ఠాగూర్‌ నరేంద్ర, ఏఎస్పీ సత్యనారాయణరావు, ఓఎస్‌డీ సూర్యచంద్రరరావు, డీఎస్పీలు పాల్గొన్నారు.
 

పోలీస్‌ సేవలు అభినందనీయం
కరోనా వైరస్‌ నియంత్రణకు పోలీసులు చేసిన సేవలు అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కొనియాడారు. జిల్లాలోని ప్రజా సంఘాలన్నీ కలసి శనివారం ఎస్పీ రాజకుమారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజల రక్షణ కోసం కుటుంబాలను విడిచి విధులు నిర్వర్తించారన్నారు. మాజీ ఎంపీ డాక్టర్‌ డీవీజీ శంకరరావు, లోక్‌సత్తా పార్టీ ప్రతినిధి బీసెట్టి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Read more