ఆకలేస్తోంది...డబ్బులియ్యమ్మా!

ABN , First Publish Date - 2020-12-18T04:18:15+05:30 IST

పగలంతా చిట్టిపొట్టి మాటలతో.. ఆటాపాటలతో అలసిసొలసిన ఇద్దరు గారాలపట్టిలను ఒడిలోకి తీసుకుని జోలపాడి నిద్రపుచ్చిన ఆ తల్లి కి ఏమైందో... ఏమో... తెల్లారేసరికి విగతజీవిగా మారింది. ఇంటి బయట మంచంపై అచేతనంగా ఉన్న అమ్మ వద్దకు చేరుకున్న ఆ ఇద్దరు చిన్నారులు.. తమ తల్లి శాశ్వత నిద్రలోకి వెళ్లిందని తెలియక...‘అమ్మా..లే. మేము నీకన్నా ముందే లేచాం చూడు.. ఆకలేస్తోంది.. డబ్బులియ్యమ్మా ఏదైనా కొనుక్కుంటాం..’ అంటూ పదేపదే కోరారు.

ఆకలేస్తోంది...డబ్బులియ్యమ్మా!
తల్లి మృతదేహం పక్కన కుమార్తెలు

తల్లి మృతదేహం వద్ద చిన్నారుల వేడుకోలు

వివాహిత అనుమానాస్పద మృతి

 ఆగూరులో ఘటన

మెంటాడ/ గజపతినగరం, డిసెంబరు 17: పగలంతా చిట్టిపొట్టి మాటలతో.. ఆటాపాటలతో అలసిసొలసిన ఇద్దరు గారాలపట్టిలను ఒడిలోకి తీసుకుని జోలపాడి నిద్రపుచ్చిన ఆ తల్లి కి ఏమైందో... ఏమో... తెల్లారేసరికి విగతజీవిగా మారింది. ఇంటి బయట మంచంపై అచేతనంగా ఉన్న అమ్మ వద్దకు చేరుకున్న ఆ ఇద్దరు చిన్నారులు.. తమ తల్లి శాశ్వత నిద్రలోకి వెళ్లిందని తెలియక...‘అమ్మా..లే. మేము నీకన్నా ముందే లేచాం చూడు.. ఆకలేస్తోంది.. డబ్బులియ్యమ్మా ఏదైనా కొనుక్కుంటాం..’ అంటూ పదేపదే కోరారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుంటే... ‘అమ్మా మేమూ నీతోనే వస్తాం... నీతో తీసుకెళ్లమ్మా... ఆటో ఆగు.. మా అమ్మ దిగుతాది...’ అంటూ అభం శుభం  తెలియని ఆ పసివారు అంటుంటే... స్థానికుల గుండెలు తరుక్కుపోయాయి. మండలంలోని ఆగూరులో గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు...స్థానికులు తెలిపిన వివరాలివీ... మెంటాడ మండలం ఆగూరుకు చెందిన గేదెల వెంకటేష్‌కు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన వసంత (25)తో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్త్తెలు మోక్షిత(4), తేజ(3). తాతలకాలం నుంచి వారసత్వంగా వస్తున్న చోరీ వృత్తినే వెంకటేష్‌ (ఇతనిపై ఎన్నో చోరీ కేసులు ఉన్నాయి) కొనసాగిస్తున్నాడు. ఇకనైనా మారాలని భార్య వసంత పలుమార్లు భర్తను కోరినా ఫలితం కనిపించలేదు. గత్యంతరం లేక వసంత సర్దుకుపోతోంది. వెంకటేష్‌ మద్యానికి బానిసవ్వడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య వసంతపై తరుచూ భౌతిక దాడికి దిగుతున్నాడు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి ఎప్పటిలా వెంకటేష్‌ మద్యంతాగి అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో.. తెల్లారేసరికి తన భార్య ఉరి వేసుకొని చనిపోయిందని కేకలు వేసుకుంటూ వీధిలోకి వచ్చాడు. ఆ ఇంట్లో వెంకటేష్‌, భార్య వసంత, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. ఆమె ఎలా చనిపోయిందని ఇరుగుపొరుగు వారు అడగ్గా.. రాత్రి గొడవ పడ్డామని.. తెల్లారి లేచేసరికి ఉరివేసుకుని చనిపోయి ఉందని అంటున్నాడు. వేరొకరి సాయంతో కిందకు దించానని చెబుతున్నాడు. అదేసమయంలో వసంత శరీరంపై గాయాలు, వెంకటేష్‌ పోలీసులకు చెబుతున్న పొంతనలేని సమాధానాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. తన చెల్లెలిది ముమ్మాటికీ హత్యేనని మృతురాలి సోదరి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఆండ్ర ఎస్‌ఐ షేక్‌శంకర్‌ సంఘటన స్థలానికి చేరుకొని పూర్వాపరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఆస్పత్రి వద్ద ఇరువర్గాల గొడవ

అత్తింటివారి కట్నం వేధింపులతోనే వసంత మృతిచెందిందని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీనిపై అత్తింటి వారు అభ్యంతరం వ్యక్తం  చేయడంతో మాటామాటా పెరిగి ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఈ ఘటన గజపతినగరం ప్రభుత్వాస్పత్రి వద్ద గురువారం చోటుచేసుకుంది. వసంత మృతిచెందిందని ఫోనలో సమాచారం అందుకున్న ఆమె తండ్రి సాయిబాబా, కుటుంబ సభ్యులు బిక్కవోలు నుంచి గురువారం ఉదయం బయలుదేరి గజపతినగరం ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న అల్లుడు వెంకటేష్‌ను ఏం జరిగిందని ప్రశ్నించారు. దంపతుల మధ్య గొడవ జరిగిందని..అందుకే చనిపోయి ఉంటుందని వెంకటేష్‌ తల్లిదండ్రులు ముత్యాలు, లక్ష్మమ్మ బదులిచ్చారు. కోపోద్రిక్తులైన మృతురాలి కుటుంబ సభ్యులు వసంతను మీరే హత్య చేశారని..కట్నం కోసం ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో మాటామాటా పెరిగి ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఎస్‌ఐ షేక్‌ శంకర్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని.. పోస్టుమార్టం నివేదిక వచ్చాక విషయం తెలుస్తుందని చెప్పారు. మృతురాలి తండ్రి సాయిబాబా విలేకరులతో మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. వివాహ సమయంలో రూ.3 లక్షలు, రెండు తులాల బంగారం ఇచ్చేందుకు సమ్మతించినట్టు తెలిపారు. కానీ రూ.2 లక్షల నగదు, ఒకటిన్నర తులాల బంగారం ఇచ్చామని...మిగతా రూ.లక్ష, అర తులం బంగారం కోసం తన కుమార్తెను నిత్యం వేధించేవారని కన్నీరుమున్నీరవుతూ చెప్పాడు. భర్త వెంకటేష్‌, బావ మహేష్‌, అత్తమామలు ముత్యాలు, లక్ష్మమ్మ, ఆడపడుచు శారదలే వసంత మృతికి కారణమని ఆరోపించారు.


Updated Date - 2020-12-18T04:18:15+05:30 IST