భయం వెం‘బడి’

ABN , First Publish Date - 2020-11-08T04:21:00+05:30 IST

పాఠశాలకు వెళ్లకపోతే తమ పిల్లలు చదువులో వెనుకబడిపోతారేమోననే భయం. తరగతికి హాజరైతే ఏవైపు నుంచి కరోనా దాడి చేస్తుందోనని భయం...ఇదీ ప్రస్తుతం తల్లిదండ్రుల పరిస్థితి. ఎట్టకేలకు పాఠశాలలు తెరచుకోవడంతో విద్యార్థులు బడిబాట పడుతున్నారు.

భయం వెం‘బడి’
విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్న దృశ్యం


పాఠశాలలకు వెళ్లడానికి వెనుకడుగు

విద్యార్థుల్లో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు 

14 మందికి పాజిటివ్‌ 

తల్లిదండ్రుల్లో ఆందోళన


పాఠశాలకు వెళ్లకపోతే తమ పిల్లలు చదువులో వెనుకబడిపోతారేమోననే భయం. తరగతికి హాజరైతే ఏవైపు నుంచి కరోనా దాడి చేస్తుందోనని భయం...ఇదీ ప్రస్తుతం తల్లిదండ్రుల పరిస్థితి. ఎట్టకేలకు పాఠశాలలు తెరచుకోవడంతో విద్యార్థులు బడిబాట పడుతున్నారు. కానీ రోజూ ఎక్కడో ఓచోట కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అటు ఉపాధ్యాయలు..ఇటు విద్యార్థులకు పాజిటివ్‌ గా వస్తుండడం కలవర పరుస్తోంది.

కలెక్టరేట్‌, నవంబరు 7: జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు...ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తేలుతుండడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. లాక్‌డౌన అనంతరం ఎట్టకేలకు ఈ నెల 2న పాఠశాలలు తెరచుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 9,10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. రోజుకు నాలుగు తరగతులే నిర్వహించాలని.. మధ్యాహ్న భోజనం పెట్టిన తరువాత విద్యార్థులను ఇంటికి పంపించాలని ప్రభుత్వం సూచించింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా భారిన పడుతుండడమే ఆందోళనకు కారణమవుతోంది. దీంతో పిల్లలను పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలూ కలిపి తొమ్మిదో తరగతికి సంబంధించి 33,396 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం 8,804 మంది విద్యార్థులే పాఠశాలలకు వస్తున్నారు. పదో తరగతికి సంబంధించి 30,453 మంది విద్యార్థులు ఉండగా... 23,158 మంది మాత్రమే వస్తున్నారు. తల్లిదండ్రుల అంగీకార పత్రంతోనే ఈ విద్యార్థులు పాఠశాలకు వస్తున్నప్పటికీ భయం పోలేదు. అక్కడకక్కడ కేసులు నమోదవుతుండడంతో కాస్త బెరుకుతోనే తరగతులకు హాజరవుతున్నారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌ తర్వాత తరగతి గదిలోకి అనుమతిస్తున్నారు. మాస్క్‌లు తప్పనిసరి చేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ పాఠశాలలకు వస్తున్న ఉపాధ్యాయలు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా కొన్నిచోట్ల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయం అందరినీ భయపెడుతోంది. 

ఈనెల 4 తేదీ నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కలిపి 3225 మంది.. విద్యార్థులు 10,822 మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు. వీరిలో 8 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేసుల నమోదుపై ఉపాధ్యాయులు, విద్యార్థులు అందోళన చెందుతున్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులందరినీ  అదుపులో ఉంచడం ఉపాధ్యాయులకు కష్టమైన పని. మధ్యాహ్న భోజన సమయంలో అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఆటలకూ వెళుతున్నారు. ఆ సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది.

తప్పని పరిస్థితిలో పంపిస్తున్నాం

పిల్లల చదువు కంటే ప్రాణం ముఖ్యం. ఎనిమిది నెలలుగా చదువుకు దూరంగా ఉన్నారు. అందరు తల్లిదండ్రులు పంపిస్తున్నారన్న ఉద్దేశంతోనే మా పిల్లలకూ జాగ్రత్తలు చెప్పి బడికి పంపిస్తున్నాం.  ఇంటికి వచ్చిన తరువాత చేతులు శానిటైజ్‌ చేసుకొనేలా చూస్తున్నాం. 

                                                             షేక్‌ రెహ్మాన్‌, విద్యార్థి తండ్రి లక్కిడాం, గంట్యాడమండలం

భయం వేస్తోంది

కరోనా వైరస్‌ తీవ్రత తగ్గలేదు. పిల్లలను బడికి పంపించాలంటే భయం వేస్తోంది. పాఠశాలల్లో కొవిడ్‌  నిబంధనలు పాటించినా.. పక్క పక్క గ్రామాల్లో పాఠశాలలు ఉన్నప్పుడు.. విద్యార్థులందరూ కలిసి వెళ్తున్నప్పుడు సమస్య వచ్చే అవకాశం ఉంది. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.

                                                                                  కె.లక్ష్మీకాంతం గృహిణి, ఒంపల్లి

Updated Date - 2020-11-08T04:21:00+05:30 IST