కరోనా కట్టడికి చర్యలు

ABN , First Publish Date - 2020-03-19T10:27:00+05:30 IST

కొవిడ్‌-19 వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను విస్తరిస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి

కరోనా కట్టడికి చర్యలు

విదేశాల నుంచి వచ్చిన వారేవరూ బయట తిరగొద్దు 

ఇంటికి పరిమితం కావాలని సూచిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ


శృంగవరపుకోట, మార్చి 18: కొవిడ్‌-19 వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను విస్తరిస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఒకరి నుంచి మరొకరికి ఇది విస్తృతంగా వ్యాపిస్తోంది. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంటిపట్టునే ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ  సూచిస్తోంది. ఈమేరకు గృహ స్వయం నిర్భంద నోటీస్‌ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే విదేశాల నుంచి వస్తున్న వారు బయట తిరగకుండా చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమవుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారంతా వారికి నచ్చిన చోటుకు వెళ్లిపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు మరెవరైనా అడిగితే తాము ఆరోగ్యంగానే ఉన్నామంటూ తిరిగి దబాయిస్తున్నారు. దీంతో వీరి ఇంటి చుట్టుపక్కల ఉన్న వారంతా ఆందోళన చెందుతున్నారు. 


విదేశాల నుంచి వచ్చిన వారిలోనే పాజిటివ్‌

ఈ వైరస్‌ ఇతర దేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వారిలోనే ఇంతవరకు పాజిటివ్‌గా కనిపించింది. మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణా రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ ఇలాంటివే. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా ముంబాయి, హైదరాబాద్‌లకు వచ్చి ఇతర ప్రాంతాలకు తరలి వెళుతుంటారు. చైనా నుంచి పాకిన ఈ వైరస్‌ చాలా దేశాలను చుట్టిముట్టేసింది. మన దేశంలో కూడా వందపైబడి పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒకట్రెండు కేసులు ఉన్నట్టు ప్రచారం జరిగినా నిర్ధిష్టంగా బయట పడలేదు.


అయితే సరిహద్దుగా వున్న ఒడిశా, తెలంగాణా రాష్ట్రాలకు కరోనా దెబ్బ తగలడంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా ఎన్నికల కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది. ప్రభుత్వం సుప్రీం కోర్డుకు వెళ్లినా ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. దీన్ని బట్టి ఈ వైరస్‌ ఎంత బలంగా భయపెడుతుందో అర్థం చేసుకోవచ్చు. 


ముమ్మరంగా వైద్య పరీక్షలు 

విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ వైరస్‌ వృద్ధి చెందుతుంది. వీరిలో ఒక్కరికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నా చూట్టుపక్కల ఎంతమంది ఉంటే అంతమందికి సోకే అవకాశం ఉంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విదేశాల నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెంపరేజర్‌ టెస్టులో కనిపించకపోయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది ద్వారా వారిని ఒక కంట కనిపెట్టాలని సూచించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలోను టెంపరేజర్‌ టెస్టులను చేయిస్తుంది. 


హెచ్చరిస్తున్నా బేఖాతరు

విదేశాల నుంచి వచ్చిన వారిని వైద్య ఆరోగ్య శాఖాధికారులు హెచ్చరిస్తున్నా వారు పెడచెవిన పెడుతున్నారు. ఇళ్ల వద్ద ఉండకుండా బంధుత్వాల పేరుతో జాతరలు, వివాహాలు వంటి వాటికి హాజరవుతున్నారు. పొరపాటున ఈ వైరస్‌ వారిలో ఉంటే మిగిలిన వారికి పాకుతుందని చెబుతున్నా వినడం లేదు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్వయం గృహ నిర్భంద నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. 

Updated Date - 2020-03-19T10:27:00+05:30 IST