50 రోజుల గృహవాసం..ఎన్నాళ్లో వనవాసం

ABN , First Publish Date - 2020-05-13T11:09:37+05:30 IST

ఇళ్లలో బంధువుల సందడి లేదు. ఊళ్లలో పెళ్లిళ్ల హడావుడి లేదు. పండగల ఊసు లేదు. ఎక్కడా జన సంచారం లేదు. చిరు దుకాణాల నుంచి పెద్ద పెద్ద మాల్స్‌ వరకూ ఎక్కడా కొనుగోలుదారుల జాడ లేదు.

50 రోజుల గృహవాసం..ఎన్నాళ్లో వనవాసం

లాక్‌డౌన్‌కు నేటితో 50 రోజులు

కరోనా నిరోధానికి స్వీయ నిర్బంధం

ఇళ్లకే పరిమితమైన జనం

మారిన జీవన చిత్రం

ఆర్థిక ఇబ్బందులతో చితికిన పేదల బతుకులు

వలస కూలీల జీవనం ఛిన్నాభిన్నం


 లాక్‌డౌన్‌... గతంలో ఎన్నడూ వినని పదం. జిల్లా వాసులకు పరిచయమే లేని పదం. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే క్రమంలో తొలిసారిగా ఈ పదాన్ని జిల్లావాసులు విన్నారు. ప్రభుత్వం నుంచి లాక్‌డౌన్‌ అనే ప్రకటన వచ్చిన మరుక్షణమే అన్నివర్గాల వారు ఇళ్లకే పరిమితమయ్యారు. అదీ ఒకటీ...రెండు రోజులు కాదు. నేటితో ఏకంగా 50 రోజులు. ఆంక్షల నేపథ్యంలో నిన్నమొన్నటి వరకూ గ్రీన్‌జోన్‌లో...ప్రస్తుతం ఆరెంజ్‌ జోన్‌లో జిల్లా ఉందంటే... అధికారుల కృషి... ప్రజల స్వీయ నియంత్రణతోనే సాధ్యమైంది. కానీ కరోనా...లాక్‌డౌన్‌ ఆంక్షలతో ఎన్నో జీవితాలు తారుమారయ్యాయి. అందరి ఆర్థిక పరిస్థితులూ తలకిందులయ్యాయి.


కూలీల నుంచి స్థితిమంతుల వరకూ ఎవరి స్థాయిలో వారిపై ఈ ప్రభావం పడింది. సినిమా థియేటర్ల నుంచి పెద్ద పరిశ్రమల వరకూ మూతపడ్డాయి. దినసరి కూలీపై ఆధారపడిన వారు నాలుగు వేళ్లూ నోట్లోకి పంపడానికి అష్టకష్టాలు పడ్డారు. వీరందరి జీవితాలు ఎప్పటికి కుదుట పడతాయో తెలియని పరిస్థితి. అటు ప్రభుత్వ ఆదాయానికీ భారీగా గండి పడింది. వివిధ రూపాల్లో రావలసిన ఆదాయం రాకుండాపోయింది.


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

 ఇళ్లలో బంధువుల సందడి లేదు. ఊళ్లలో పెళ్లిళ్ల హడావుడి లేదు. పండగల ఊసు లేదు. ఎక్కడా జన సంచారం లేదు. చిరు దుకాణాల నుంచి పెద్ద పెద్ద మాల్స్‌ వరకూ ఎక్కడా కొనుగోలుదారుల జాడ లేదు. ఇల్లు కదిలి ఎవరూ బయటకు వచ్చిన పనేలేదు. ఇదీ జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రభావం. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన మరుక్షణమే ప్రజలూ అంతే సానుకూలంగా స్పందించారు. పట్టణాల నుంచి పల్లెటూళ్ల వరకూ ఎవరికి వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అటు అధికారులూ అంతే స్థాయిలో  ముందస్తు జాగ్త్రలు తీసుకున్నారు. ఫలితంగానే నిన్న మొన్నటి వరకూ జిల్లా గ్రీన్‌జోన్‌లో ఉంది. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం ఎంతో ఫలితాన్నిచ్చింది. నాణేనికి మరోవైపు చూస్తే లాక్‌డౌన్‌తో అనేక జీవితాలు తారుమారయ్యాయి.


ఎంతోమంది ఉపాధికి దూరమయ్యారు. కూలీలు తినడానికి తిండికి లేక అవస్థలు పడ్డారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పరిశ్రమలు మూత పడ్డాయి. ఉద్యోగులు...కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇదంతా ఒక ఎత్తయితే ఉపాధి కోసం వలస వెళ్లిన వారంతా ఇంటిముఖం పట్టారు. కొందరు  కాలి నడకన... మరికొందరు ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయించి... స్వగ్రామాలకు చేరుకున్నారు. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చి బుధవారంతో 50 రోజులు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల వారిపై దీని ప్రభావం తీవ్ర స్థాయిలో పడింది. 


 దేశ వ్యాప్తంగా రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిచిపోవడం ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరు. మార్చి 22 నుంచి రైల్వే, ఆర్టీసీ సర్వీసులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రవాణా స్తంభించింది. ఒక్క ఆర్టీసీ ద్వారానే విజయనగరం రీజియన్‌కు రోజుకు కోటి రూపాయలు ఆదాయం రావాలి. గత 50 రోజుల్లో రూ.50 కోట్ల ఆదాయానికి గండి పడింది. ఉద్యోగుల జీతభత్యాలు, తదితర ఖర్చుల రూపంలో మరో రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. 


వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా అరటి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా లేక గిట్టుబాటు ధర కోల్పోయారు. మొక్కజొన్న రైతులదీ ఇదే పరిస్థితి. లాక్‌డౌన్‌కు తోడు వర్షాలకు పంటలు తడిసిపోయి, సకాలంలో అమ్మకానికి వీలుకాలేదు. కూరగాయలు, మామిడి పంటకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 


వాణిజ్యం ఆగిపోయింది. విజయగనరం అంటేనే హోల్‌సేల్‌ వ్యాపారానికి పెట్టింది పేరు. కిరాణా హోల్‌ సేల్‌గా విక్రయించే ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, మిర్చి, ఎండుమిర్చి, చింతపండు, కందిపప్పు, మినపగుళ్లు, ఇడ్లీనూక ఇలా అన్నీంటి రవాణా నిలిచిపోయింది. వివాహ సీజన్‌ వచ్చిందంటే వస్త్ర వ్యాపారానికి అంతు ఉండేది కాదు. ఈసారి పూర్తిగా దెబ్బతింది. 


జిల్లాలో వందల సంఖ్యలో వివాహాలు నిలిచిపోయాయి. ఇతర శుభకార్యాలను సైతం వాయిదా వేసుకున్నారు. ఈవెంట్లపై ఆధార పడి జీవిస్తున్న అనేక వర్గాల వారు ఉపాధి కోల్పోయారు. జిల్లా 50 రోజుల్లో వాణిజ్య వ్యాపారాల ద్వారా రూ.లక్ష కోట్ల టర్నోవర్‌ నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. సైకిల్‌ నుంచి విమానాల వరకు ఎవరినీ రోడ్డుపైకి రానీయకుండా కట్టడి చేశారు. ఇంటికే ప్రజలు పరిమితం కావాల్సి వచ్చింది. విదేశాలకు వెళ్లిన వారు సైతం అక్కడే చిక్కుకున్నారు. తండ్రి ఒకచోట.. తల్లి ఒకచోట.. పిల్లలు మరోచోట ఉండిపోయారు. 


లాక్‌డౌన్‌తో ప్రధానంగా ఉపాధి పోయింది. టీ దుకాణం నుంచి కిళ్లీ బడ్డీ వరకు.. కిరాణా వ్యాపారం నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు మూత పడ్డాయి. వాణిజ్య వాపార రంగాల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికులు వీధిన పడ్డారు. ఉపాధి కోసం చెన్నై, బెంగళూరు, ముంబయి, గుజరాత్‌ ఇలా అనేక రాష్ట్రాలకు వెళ్లిన వారు పనులు లేక  తిరుగుముఖం పట్టారు. వస్తూ అవస్థలు పడ్డారు. నేటికీ ప్రయాణంలో నరకయాతన ఎదుర్కొంటున్నారు. 


విద్యా రంగంపైనా తీవ్ర ప్రభావం పడింది. విద్యా సంవత్సరాన్ని లాక్‌డౌన్‌ కకావికలం చేసింది.  ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలన్నీ మూత పడ్డాయి. ప్రాథమిక విద్యనుంచి పీజీ వరకు.. ఐటీఐ నుంచి ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌ వరకు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. చోలాచోట్ల నుంచి విద్యార్థులు ఇళ్లకు చేరలేని పరిస్థితి ఏర్పడింది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేశారు. 10వ తరగతి పరీక్షలు జూలైలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. డిగ్రీ పరీక్షలను నిర్వహించనే లేదు. చివరి సంవత్సరం మినహా మిగిలిన ఏడాదుల్లో కొనసాగుతున్న వారిని పై సంవత్సరానికి అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 


వైద్యశాఖపై ఒత్తిడి పెరిగింది. గ్రామ స్థాయిలోని ఆశా వర్కర్‌ నుంచి జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని డాక్టర్లు, జిల్లా వైద్య శాఖ అధికారుల వరకు తీవ్రమైన  ఒత్తిడి మధ్య పనిచేస్తున్నారు. 


పోలీస్‌ సేవలు భేష్‌ అనిపించాయి. పోలీస్‌ శాఖలోని గ్రామ స్థాయిలో ఉన్న పోలీస్‌ సహాయకులు, హోమ్‌గార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీ వరకు ప్రతి క్షణం విధుల్లోనే కాలం గడిపారు. రాత్రీ పగలు తేడా లేకుండా సేవలందిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తూ.. తనిఖీలు చేస్తూ.. వైరస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ముందుకు సాగుతున్నారు. 


ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలన్నా రెవెన్యూతో ముడి పడి ఉంటుంది. విపత్తుల సమయంలో అయితే మరింత కీలకం. గ్రామ స్థాయిలోని వీఆర్‌ఓ నుంచి కలెక్టర్‌ వరకు కరోనా వైరస్‌ సమయంలో కీలకంగా వ్యవహించారు. కలెక్టర్‌తో సహా ప్రభుత్వ యంత్రాంగం కృషి ఫలితం, ప్రజల సహకారంతోనే జిల్లాలో రెండో విడత లాక్‌డౌన్‌ వరకు వైరస్‌ కేసులు జిల్లాలో నమోదు కాలేదు. మూడో విడత కాలంలో నాలుగు కేసులు నమోదు కావడం కలకలం రేగింది. అయినప్పటికీ వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 

Read more