‘మత్స్య యోజన’లో రూ.4.45 కోట్లు
ABN , First Publish Date - 2020-12-04T04:26:10+05:30 IST
ప్రధానమంత్రి మత్స్య యోజన కింద వివిధ పథకాల అమలు కోసం జిల్లాకు రూ.4.45 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ చెప్పారు. కలెక్టర్ చాంబర్లో మత్స్య టాస్క్ఫోర్సు కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు.

కలెక్టరేట్, డిసెంబరు 3: ప్రధానమంత్రి మత్స్య యోజన కింద వివిధ పథకాల అమలు కోసం జిల్లాకు రూ.4.45 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ చెప్పారు. కలెక్టర్ చాంబర్లో మత్స్య టాస్క్ఫోర్సు కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 రకాల పథకాలను 40 నుంచి 60 శాతం రాయితీపై అందిస్తామన్నారు. జనరల్, ఎస్సీ, ఎస్టీ, మహిళ (నాలుగు) కేటగిరీల కింద యూనిట్లు మంజూరు చేస్తామని చెప్పారు. పథకాల ద్వారా మత్స్యకారుల జీవితాలు మార్చవచ్చని, వాటిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆదేశించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు లైవ్‌ఫిష్ వెండింగ్ కేంద్రాలు, ఇన్సులేటెడ్ వాహనాలు, మోటార్ సైకిల్స్ విత్ ఐస్‌బాక్సులు, చేపలు మార్కెటింగ్ చేయడానికి ఐస్ బాక్స్‌తో కూడిన మూడు చక్రాల రిక్షాలు, సంప్రదాయ మత్స్యకారులకు బోట్లు.. వలలు తదితర పథకాల కోసం రూ.286.22 లక్షలు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. జలాశయాల్లో పెంచడానికి చేప పిల్లలు, మార్కెటింగ్ పరికరాలు, రిక్షాలు, వలలు తదితర వాటికి రూ.86.26 లక్షలు కేటాయించనున్నారు. ఎస్టీలకు రూ.56.76 లక్షలు, ఎస్సీలకు రూ.24.66 లక్షలతో వివిధ పరికరాలు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, మత్య్స శాఖ డీడీ నిర్మలాకుమారి తదితరులు పాల్గొన్నారు.