260 ఏళ్ల పెద్ద చెరువు
ABN , First Publish Date - 2020-05-29T09:49:36+05:30 IST
పెద్ద చెరువు... పేరుకు తగ్గట్టే విజయనగరం జిల్లా కేంద్రంలోనే అతి పెద్ద చెరువు. దీని చుట్టూనే పట్టణం విస్తరించి ఉంది. సుమారు 260 ఏళ్ల క్రితం ..

పెద్ద చెరువు... పేరుకు తగ్గట్టే విజయనగరం జిల్లా కేంద్రంలోనే అతి పెద్ద చెరువు. దీని చుట్టూనే పట్టణం విస్తరించి ఉంది. సుమారు 260 ఏళ్ల క్రితం దీన్ని పూసపాటి రాజవంశీయులు తవ్వించారని చెబుతుంటారు. కరువు కాటకాలను జయించేందుకు... ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు విజయరామ గజపతిరాజు ఎన్నో చెరువులను తవ్వించినట్లు చెబుతుంటారు. వాటిలో పెద్ద చెరువు ఒకటి. విజయనగరం పట్టణంలో వందలాది ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం నాటికే ఈ చెరువు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. బొబ్బిలి రాజులతో విజయరామ గజపతి యుద్ధానికి వెళుతుంటే సోదరి పైడితల్లి వారించింది. ఆయన వినిపించుకోకుండా యుద్ధానికి వెళ్లి...మరణించారు.
ఈ సమాచారం విన్న పైడితల్లి కుప్పకూలి... భూమిలో విలీనమైనట్లు ఈ ప్రాంతంలో ఓ కథ ప్రచారంలో ఉంది. తరువాత పతివాడ అప్పలనాయుడు అనే వ్యక్తి కలలో పైడితల్లి కనిపించి తన ప్రతిమ పెద్ద చెరువులో ఉందని... దానిని గుర్తించి పూజలు చేయాలని కోరినట్టు ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి స్థల పురాణం చెబుతోంది. అలా పెద్ద చెరువు చారిత్రక ప్రాశస్త్యం పొందింది. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు చుట్టు పక్కల కబ్జాకు గురవుతోంది. అధికారులు స్పందించి...ఆక్రమణలు తొలగిస్తే... మన చరిత్రకు సాక్ష్యంగా ఇది నిలుస్తుందనడంలో సందేహం లేదు.