-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » ys jagan vishaka
-
‘ఇలా చేస్తారనుకోలేదు.. అందుకే చెక్కును వెనక్కు ఇచ్చేశా..’
ABN , First Publish Date - 2020-05-13T13:50:51+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ గత గురువారం కేజీహెచ్‌కు వచ్చినప్పుడు...

సీఎం మాట.. నీటిమూట
అస్వస్థతకు గురైన వారికి రూ.లక్ష ఇస్తానని హామీ ఇచ్చారు
ఇప్పుడు రూ.25 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా?
ప్రభుత్వ తీరుపై ఎల్‌జీ పాలిమర్స్ బాధితుల తీవ్ర నిరసన
భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటని ప్రశ్న
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్ గత గురువారం కేజీహెచ్‌కు వచ్చినప్పుడు... పాలిమర్స్ ప్రమాదం వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇస్తానన్నారు. తీరా ఇప్పుడేమో రూ.25 వేల చెక్కు చేతిలో పెట్టారు. అన్ని విధాలా అదుకుంటామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, ఇప్పుడు పాతిక వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటాడా?’’ ....ఇదీ ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల గోడు.
మంగళవారం పలువురు బాధితులు ‘ఆంధ్రజ్యోతి’ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేజీహెచ్‌లో వైద్య సేవలు సరిగా లేవని, మందులు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో పెడుతున్న భోజనం అధ్వానంగా వుందని, కుక్కలు కూడా తినవేమోనన్నారు. పూర్తిగా కోలుకోకముందే డిశ్చార్జి చేస్తామంటున్నారని, ఇంటికి వెళ్లిన తరువాత ఆరోగ్య సమస్య తలెత్తిగా ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిం చారు. బాధితుల గోడు వారి మాటల్లోనే....
రూ.10 లక్షలు అన్నారు.. రూ.25 వేలు ఇచ్చారు...
ముఖ్యమంత్రి జగన్ నా వద్దకు వచ్చి పరామర్శించినప్పుడు మమ్మల్ని అన్ని విధాలా అదుకుంటారన్న నమ్మకం ఏర్పడింది. మెరుగైన వైద్యం అందించి, ఆరోగ్యం కుదుట పడేలా చేస్తామని, రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు రూ.25 వేల చెక్కు ఇచ్చి, ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపొమ్మంటున్నారు. చెక్కును వెనక్కు ఇచ్చేశాను. జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కేజీహెచ్‌లో వైద్యం బాగోలేదు. కనీసం ఫ్యాన్లు కూడా తిరగడం లేదు. ఆస్పత్రిలో ఇచ్చిన భోజనం చాలా చెత్తగా జీంది.
- ఎస్.కె.హాసిన్, పాలిమర్స్ గ్యాస్ బాధితురాలు

న్యాయం చేయకపోతే ఆత్యహత్యలే....
ఎల్‌జీ పాలిమర్స్ ఘటన వల్ల మేము అన్ని విధాలా నష్టపోయాం. ముఖ్యమంత్రి కూడా నమ్మించి మోసం చేశారు. ఈరోజు పాతిక వేల రూపాయలు ఇచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి పొమ్మంటున్నారు. భవిష్యత్తులో మా ఆరోగ్యం ఎలా వుంటుందోనని ఆందోళనగా ఉంది. గ్రామంలో నీరు, నేల, ఇళ్లు, గాలి, పొలాలు.... అన్నీ కలుషితమయ్యాయని అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం.
- వెంకటలక్ష్మి, పాలిమర్స్ గ్యాస్ బాధితురాలు

ఆరోగ్యానికి భరోసా లేదు
ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ ఘటనతో మా కుటుంబం మొత్తం అస్వస్థతకు గురైంది. అందరం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాం. నా కుమారై భానుప్రియను ముఖ్యమంత్రి జగన్ పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ అధికారులు ఇప్పుడు రూ.25 వేలకు చెక్కు ఇచ్చి వెళ్లిపొమ్మంటున్నారు. నా కుమారై మాట్లాడలేకపోతున్నది. సరైన చికిత్స అందించడం లేదు. కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం ఇంటిని అమ్ముదామనుకున్నాను. ఈ ఘటనతో ఇంటిని ఎవరూ కొనే పరిస్థితి లేదు. భవిష్యత్తులో మా ఆరోగ్యాలకు భరోసా లేదు.
- గణపతిరావు, బాధితుడు
