మాజీ ఎమ్మెల్యేపై వైసీపీ గురి!

ABN , First Publish Date - 2020-09-25T11:32:47+05:30 IST

అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్..

మాజీ ఎమ్మెల్యేపై వైసీపీ గురి!

మాజీ ఎమ్మెల్యే గోవింద ఇంటి ప్రహరీ కూల్చివేతకు యత్నం

ఇరవై ఏళ్ల క్రితం నిర్మిస్తే ఇప్పుడు ఆక్రమణగా గుర్తింపు!


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణను వైసీపీ అధిష్ఠానం టార్గెట్‌ చేస్తోందని ఆయన సోదరుడు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ ఆరోపించారు. పెందుర్తిలో ఇరవై ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటి ప్రహరీ కొంత గెడ్డ స్థలంలో వుందంటూ రెవెన్యూ అధికారులు, సిబ్బంది గురువారం గోడపై మార్కింగ్‌ చేయడం... కక్ష సాధింపులో భాగమేనని ధ్వజమెత్తారు. ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ప్రహరీ కూల్చివేతకు సిద్ధపడ్డారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ముఖ్య నాయకులను నయానో భయానో దారిలోకి తెచ్చుకోవాలని వైసీపీ యత్నిస్తోందని, మాట వినని నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని ఆరోపించారు.తన సోదరుడు గోవింద సత్యనారాయణ కరోనా బారిన పడి షీలానగర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్నారని, ఇటువంటి సమయంలో వేధింపులకు పాల్పడడం దారుణమన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే వున్న తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని వైసీపీ చూస్తోందన్నారు. కాగా ప్రహరీ కూల్చివేతకు రెవెన్యూ సిబ్బంది గురువారం రాత్రి ఎక్స్‌కవేటర్‌తో అక్కడికి వెళ్లారు. అయితే ఆ సమయంలో అధికారులు రాకపోవడంతో వెనుతిరిగారు.

Updated Date - 2020-09-25T11:32:47+05:30 IST