విశాఖపై వైసీపీ గురి

ABN , First Publish Date - 2020-09-21T10:07:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో పట్టు కోసం అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సాగర తీర నగరంపై ఆ పార్టీ అధినేత జగన్‌కు ఎప్పటి నుంచో మోజు. 2014 ఎన్నికల బరిలో నేరుగా తన తల్లి విజయలక్ష్మినే నిలిపారు.

విశాఖపై వైసీపీ గురి

పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో నగరంపై పట్టు కోసం యత్నం

టీడీపీ ఎమ్మెల్యేలకు వల.. నయానోభయానో పార్టీలోకి చేర్చుకునేందుకు వ్యూహం

జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించిన సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి

కుమారులకు పార్టీ కండువా.. త్వరలో గంటా...ఆ తరువాత గణబాబు?

వెలగపూడిపైనా ఒత్తిడి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో పట్టు కోసం అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సాగర తీర నగరంపై ఆ పార్టీ అధినేత జగన్‌కు ఎప్పటి నుంచో మోజు. 2014 ఎన్నికల బరిలో నేరుగా తన తల్లి విజయలక్ష్మినే నిలిపారు. ఆమె నాటి బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైసీపీ విజయఢంకా మోగించినా విశాఖ నగరంలోని నాలుగు స్థానాల్లోనూ ఓటమి చవిచూసింది. ఇక్కడ తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం నియోజక వర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు. విశాఖలో ఈ విధమైన తీర్పును వైసీపీ అధిష్ఠానం జీర్ణించుకోలేకపోయింది. ఎలాగైనా ఆ నలుగురిని పార్టీలోకి రప్పించుకుంటే... విశాఖలో ఇక తిరుగు వుండదని వ్యూహాలకు పదును పెట్టింది. దీనిపై చాలాకాలంగా మంతనాలు సాగుతున్నాయి. సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అందరికంటే ముందుగా వైసీపీ తీర్థం తీసుకునేందుకు యత్నించారు. స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అడ్డం పడడంతో కొన్నాళ్లు ఆ ప్రక్రియ ఆగింది. కొద్దిరోజుల క్రితం గంటా నేరుగా జగన్‌తోనే మాట్లాడుకొని చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారంటున్నారు. ఈ నెలాఖరులో వైసీపీ కండువా కప్పుకొనే అవకాశం వుందని తెలుస్తోంది. ఆయనకు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ పదవి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.


వైసీపీ నీడకు వాసుపల్లి 

విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ మూడో కంటికి తెలియకుండా శనివారం జగన్‌ను కలిశారు. విద్యా వ్యాపారంలో వున్న ఆయన ముందుకు సాగాలంటే అధికార పార్టీ నీడన చేరక తప్పదని గ్రహించి అటు వైపు అడుగులు వేశారు. దీనికి హైదరాబాద్‌ నుంచి కూడా కొంత రాయబారం నడిచిందని సమాచారం. ఏదేమైనా వాసుపల్లి చడీచప్పుడు లేకుండా అమరావతి వెళ్లి తన ఇద్దరు కుమారులతో కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.


విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కూడా వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో కరోనా ఎక్కువగా వున్నందున, అది తగ్గిన తరువాత వైసీపీ వైపు అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.


విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కరుడుగట్టిన టీడీపీ నాయకుడు. కృష్ణా జిల్లావాసి అయిన ఆయనను కొడాలి నాని, వల్లభనేని వంశీ, కరణం బలరాం తదితరులు వైపీపీలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఇంకా వైసీపీ అధిష్ఠానానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని చెబుతున్నారు. 


ముందుగా ఆడారి ఆనంద్‌

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన ఆడారి ఆనంద్‌కుమార్‌ వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆయన విశాఖ డెయిర్‌కి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఆడారి తులసీరావు సీనియర్‌ తెలుగుదేశం నాయకులు. డెయిరీ చైర్మన్‌. వ్యాపార అవసరాలను దృష్టిలో వుంచుకొని డెయిరీ చేజారిపోకుండా ఉండేందుకు ఎన్నికలైన కొద్ది రోజులకే ఆనంద్‌ పార్టీ మారిపోయారు. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్‌ వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు కూడా తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరిపోయారు. 


పల్లా కోసం గట్టి పట్టు

బీసీ నాయకుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకోవాలనేది వైసీపీ అధిష్ఠానం బలమైన కోరిక. 2019 ఎన్నికలు ముగిసిన నాటి నుంచే గేలం వేస్తున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్‌ స్థానం ఆఫర్‌ చేశారు. అయితే ఆయన ఎక్కడా లొంగ లేదు.

Updated Date - 2020-09-21T10:07:28+05:30 IST