జెండా మోసిన మాకు విలువ లేదా..?
ABN , First Publish Date - 2020-12-20T05:40:11+05:30 IST
సీఎం జగన్ జన్మదిన వేడుకల నిర్వహణకు సంబం ధించి శనివారం ఇక్కడ ఏర్పాటైన వైసీపీ శ్రేణుల సమావేశం రసాభాసగా మారింది.

ఆర్‌ఐ మాటలకే ఎమ్మెల్యే అధిక ప్రాధాన్యమా..!
ఆయన అండతో భారీ స్థాయిలో కుంభకోణాలు
జగన్ జన్మదినం నిర్వహణపై అచ్యుతాపురంలో ఏర్పాటైన సమావేశం రసాభాస
ఆర్‌ఐ తీరు.. ఎమ్మెల్యే వ్యవహారం..పై భగ్గుమన్న వైసీపీ శ్రేణులు
అచ్యుతాపురం, డిసెంబరు 19 : సీఎం జగన్ జన్మదిన వేడుకల నిర్వహణకు సంబం ధించి శనివారం ఇక్కడ ఏర్పాటైన వైసీపీ శ్రేణుల సమావేశం రసాభాసగా మారింది. అధిక శాతం నాయకులు తూటాల్లాంటి మాటలతో ప్రశ్నలు సంధించడంతో అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలివి. ఈ నెల 21న జగన్ జన్మదినం రోజున చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళికకు మండల వైసీపీ కన్వీనర్ మారిశెట్టి సూర్యనారాయణ ఆధ్వర్యంలో అచ్యుతాపురం పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత సూర్యనారాయణ వేడుకలు ఎలా జరిపితే బాగుంటుందని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంతలో పలువురు పార్టీ శ్రేణులు ఉవ్వెత్తున లేచారు. ఆ వేడుకలు సంగతి అలా ఉంచండి.. మండలంలో ఆర్‌ఐ సంగతి ముందు తేల్చండి అంటూ. పట్టు బట్టారు. ఎమ్మెల్యే అండ చూసుకుని ఆర్‌ఐ రమణ భారీ స్థాయిలో కుంభకోణాలకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం ఉండ డం లేదుసరికాదా, ఆయన కూడా అతనికే వత్తాసు పలుకుతున్నారని మెజార్టీ నాయ కులు మండిపడ్డారు. ఆర్‌ఐ చెప్పిన మాటలే ఎమ్మెల్యే వింటున్నారని, పార్టీ జెండా మోసిన తమ మాటలు వినడం లేదని వాపోయారు. మండలంలో ఏపని కావాలన్నా స్థానికేతర వ్యక్తి అనుమతి కావాలని ఆర్‌ఐ చెపుతున్నారని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే కూడా స్థానికేతర వ్యక్తితో పాటు ఆర్‌ఐ మాటలకే విలువ ఇస్తున్నారని దుయ్యబట్టారు. అంతే కాకుండా ఆర్‌ఐ తమపై చాడిలు చెపుతున్నారని, వాటిని ఎమ్మెల్యే విని పార్టీ సీనియర్ నాయకులను సైతం కించపరుస్తున్నారని విరుచుకుపడ్డారు. దీంతో సమావేశాన్ని అర్ధం తరంగా ముగించారు. నాయకులు కోన బుజ్జి, వడిసెల శ్రీనివాసరావు, భీముని వెంకటేశ్వ రరావు, నర్మాల కుమార్, బలిరెడ్డి శ్రీను, లాలం శ్రీనివాస్, గొర్లె రామజోగి, కొరు ప్రోలు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.