వైసీపీ హ ంగామా

ABN , First Publish Date - 2020-12-28T05:48:27+05:30 IST

సత్యప్రమాణానికి సవాల్‌చేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.... ఈస్ట్‌పాయింట్‌ కాలనీలోని షిరిడీసాయిబాబా ఆలయానికి రావాలంటూ వైసీపీ నాయకులు ఆదివారం హంగామా చేశారు.

వైసీపీ హ ంగామా
షిరిడీసాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే అమర్‌నాథ్‌, పార్టీ నాయకులు వంశీకృష్ణ, కె.కె.రాజు, తదితరులు

పార్క్‌హోటల్‌ జంక్షన్‌ నుంచి ఈస్ట్‌పాయింట్‌ కాలనీ షిరిడీసాయిబాబా ఆలయం వరకు పార్టీ శ్రేణులు ప్రదర్శన

ఎమ్మెల్యే వెలగపూడి సత్యప్రమాణానికి రావాలని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ డిమాండ్‌

గంటసేపు ఆలయంలో వేచివున్న వైసీపీ నేతలు

వెలగపూడి రాకపోవడంతో తిరుగుముఖం

టీడీపీ నేతల సవాళ్లకు స్పందించబోమన్న అమర్‌నాథ్‌


విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సత్యప్రమాణానికి సవాల్‌చేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.... ఈస్ట్‌పాయింట్‌ కాలనీలోని షిరిడీసాయిబాబా ఆలయానికి రావాలంటూ వైసీపీ నాయకులు ఆదివారం హంగామా చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాఽథ్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు... పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ నుంచి షిరిడీసాయిబాబా ఆలయం వరకు ప్రదర్శనగా వెళ్లారు.  భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు ఆలయం వద్దకు రావడంతో... పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కిపంపేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విశాఖలో అనేక  భూకబ్జాలకు పాల్పడ్డారని, బినామీల పేర్లతో ప్రభుత్వ భూములను కాజేశారని ఆరోపిస్తూ వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై స్పందించిన వెలగపూడి.... ఎంపీ చేసిన ఆరోపణలు ఆవాస్తవమని, ఈస్ట్‌పాయింట్‌ కాలనీలోని షిరిడీసాయిబాబా ఆలయంలో సత్యప్రమాణం చేసి తన సచ్చీలతను నిరూపించుకుంటానని, ఆరోపణలను ఆయన (విజయసాయిరెడ్డి) నిరూపించలేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించలేదు. అయితే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాఽథ్‌ స్పందించి, తాను ఆదివారం ఉదయం 11 గంటలకు ఆలయానికి వస్తానని, వెలగపూడి కూడా వచ్చి సత్యప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు. అన్నట్టుగానే ఎమ్మెల్యే అమర్‌నాఽథ్‌ ఉదయం పది గంటలకు బీచ్‌రోడ్డులోని వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేశారు. అక్కడి నుంచి వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె.కె.రాజుతోపాటు కార్యకర్తలతో కలిసి నడుచుకుంటూ సాయిబాబా ఆలయానికి చేరుకున్నారు. 12 గంటల వరకు ఎదురుచూశారు. వెలగపూడి రాకపోవడంతో బయటకు వ చ్చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వెలగపూడి రామకృష్ణబాబు రుషికొండలో 230 గజాల గెడ్డపోరంబోకు భూమిని కబ్జాచేసి, నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. విజయవాడలో వంగవీటి రంగా హత్యకేసులో నిందితుడిగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్టు కొన్ని పత్రాలను చూపించి ఇవి వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సవాల్‌ చేసిన వ్యక్తి ప్రమాణానికి రాకుండా విజయసాయిరెడ్డి వస్తేనే ప్రమాణం చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకపై టీడీపీ నేతల సవాళ్లకు తాము స్పందించబోమని, చంద్రబాబు లేదా లోకేశ్‌ సవాల్‌చేస్తేనే తాము స్పందిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆలయం పరిసరప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-12-28T05:48:27+05:30 IST