కరోనా అటెన్షన్‌! ఇల్లు కదలొద్దు!

ABN , First Publish Date - 2020-03-18T06:27:36+05:30 IST

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి

కరోనా అటెన్షన్‌! ఇల్లు కదలొద్దు!

అవసరమైతే తప్ప ఓ వారం పాటు బయటకు రావొద్దు

జన సమ్మర్థంగా ఉన్న ప్రాంతాలకు అసలు వెళ్లొద్దు

వైద్య ఆరోగ్య శాఖ అధికారుల హెచ్చరిక

జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రకటన

...అయినప్పటికీ కొంతకాలం అప్రమత్తంగా ఉండాలని సూచన

వైరస్‌ పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన అవసరం

వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గీతా ప్రసాదిని

వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

అధికారులు, సిబ్బందికి ఇక్కడి నుంచే సూచనలు, సలహాలు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తిచేస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమును మంగళవారం ఆ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గీతా ప్రసాదిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా నియంత్రించేంత వరకు ప్రజలకు హోమ్‌ ఐసోలేషన్‌ కావాల్సిన అవసరం ఉందన్నారు. మరో వారం రోజులపాటు ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావడం ద్వారా వీలైనంత వరకు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవకాశం ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ పర్యవేక్షిస్తున్నామని, అనుమానిత లక్షణాలు వుంటే వారిని వెంటనే కరోనా ప్రత్యేక వార్డుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామన్నారు. సుమారు పదికిపైగా దేశాల నుంచి నగరానికి వందలాది మంది వచ్చారని, వీరిలో ఎవరికీ కరోనా వున్నట్టు నిర్ధారణ కాలేదన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అన్ని పరీక్షలు చేసిన తరువాత మాత్రమే వారిని ఇళ్లకు పంపిస్తున్నట్టు వివరించారు. 


విశాఖ జిల్లాలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టంచేశారు. అయినప్పటికీ వీలైనంత వరకు జన సంచారం ఎక్కువగా వుండే ప్రదేశాలకు ఈ వారం రోజులు దూరంగా వుండాలని ఆమె సూచించారు. కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఎవరిలోనైనా వుంటే వెంటనే అప్రమత్తమై వైద్యులకు సమాచారాన్ని అందించాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి జిల్లాకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు మొత్తం మానిటరింగ్‌ చేస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.తిరుపతిరావు తెలిపారు. ప్రజలు అనవసర భయాందోళనలు పెట్టుకోవద్దని స్పష్టంచేశారు. కార్యక్రమంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్‌ వసుంధర, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 


కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కలిగించడంతోపాటు సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేయడానికి, సరైన సూచనలు ఇవ్వడానికి వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో అధికారులు కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేశారు. సుమారు 20 మంది సిబ్బందిని నియమించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఇతర వైద్యశాఖ సిబ్బందికి ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అనుమానిత కేసులను ఎక్కడైనా గుర్తించినట్టయితే వారిని ఏం చేయాలి, ఎక్కడ ఉంచాలి?...అనే విషయాలను వారికి తెలియజేస్తున్నారు. వైరస్‌ పూర్తిగా నియంత్రణలోకి వచ్చేంత వరకు కంట్రోల్‌ రూమ్‌ను కొనసాగిస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.


కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది ప్రతిరోజూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వివరాలను ఎయిర్‌పోర్టులోని సిబ్బంది వద్ద నుంచి సేకరించడం, వారు ఎక్కడికి వెళుతున్నారో క్షేత్రస్థాయిలో వున్న వైద్య సిబ్బందికి తెలియజేయడం, ప్రజల్లో అవగాహన కలిగించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించడం, అనుమానిత కేసులు నమోదైతే వాటికి సంబంధించిన నమూనాలను హైదరాబాద్‌ పంపించడం, వాటి రిపోర్టులు వచ్చేంత వరకు వైద్యం అందుతున్న తీరును పరిశీలించడం, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి సకాలంలో చేరవేయడం చేస్తారని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-03-18T06:27:36+05:30 IST