ఫ్లైఓవర్‌ ఎప్పటికి పూర్తయ్యేనో!!

ABN , First Publish Date - 2020-12-28T05:45:55+05:30 IST

నగరంలోని ఎన్‌ఏడీ జంక్ష న్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అంతు చిక్కడం లేదు. కొన్నాళ్లుగా వీఎంఆర్‌డీఏ అధికారులు ‘అదిగో అయిపోయింది... ఇదిగో అయిపోయింది’ అని ప్రకటనలు చేస్తున్నారు.

ఫ్లైఓవర్‌ ఎప్పటికి పూర్తయ్యేనో!!

ప్రారంభం ఎప్పటికప్పుడు వాయిదా

ఈ నెల 25 నుంచి అప్పర్‌ రోటరీపై వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్న వీఎంఆర్‌డీఏ అధికారులు

గడువు దాటినా కార్యరూపం దాల్చని ప్రకటన

పది శాతం కూడా జరగని లోవర్‌ రోటరీ పనులు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని ఎన్‌ఏడీ జంక్ష న్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అంతు చిక్కడం లేదు. కొన్నాళ్లుగా వీఎంఆర్‌డీఏ అధికారులు ‘అదిగో అయిపోయింది... ఇదిగో అయిపోయింది’ అని ప్రకటనలు చేస్తున్నారు. ఆరు రోజుల క్రితం దీనిపై సమీక్షించిన అధికారులు... ఈ నెల 25వ తేదీ నుంచి ఫ్లైఓవర్‌పై రాకపోకలు ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి ప్రకటనలు గత ఏడాది కాలంగా చాలానే చేశారు. 2017లో రూ.113.81 కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణం ప్రారంభించారు. ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు బాధ్యతలు చేపట్టిన విజయ నిర్మాణ్‌ కంపెనీ ఫ్లైఓవర్‌ డిజైన్‌ (రోటరీ మోడల్‌)ను కూడా తానే తయారుచేసింది. కాగా కరోనాతో నాలుగు నెలలు పనులన్నీ ఆగిపోయాయి. ఇసుక లభించక కొంత జాప్యం జరిగింది. ఆ తరువాత వేగవంతం చేశారు. ఎప్పటికప్పుడు డెడ్‌లైన్లు ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ ఏదీ చెప్పిన సమయానికి పూర్తిచేయలేకపోతున్నారు.


రోటరీ మోడల్‌లో ఈ ఫ్లైఓవర్‌కి ఒక అప్పర్‌ రోటరీ, ఒక లోవర్‌ రోటరీ వస్తాయి. ప్రస్తుతం అప్పర్‌ రోటరీ పనులు జరుగుతున్నాయి. ఇందులో నాలుగు వైపులా నాలుగు ఆర్మ్స్‌(దారులు) ఉంటాయి. ఈ జంక్షన్‌ నుంచి ఎన్‌ఎస్‌టీఎల్‌ మీదుగా నగరంలోకి రావడానికి ఒకటి, గోపాలపట్నం వైపు ఒకటి, మర్రిపాలెం వైపు మరొకటి, వి గాజువాక వైపు వెళ్లడానికి మరొకటి నిర్మిస్తున్నారు. విమానాశ్రయం నుంచి ఎన్‌ఎస్‌టీఎల్‌ మీదుగా నగరంలోకి వచ్చే దారిని అక్టోబరులో మంత్రి బొత్స సత్యనారాయణ చేతులమీదుగా ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు నుంచి గోపాలపట్నం వైపు, గోపాలపట్నం నుంచి ఎన్‌ఎస్‌టీఎల్‌ మీదుగా నగరంలోకి వచ్చే మార్గాన్ని నవంబరులో అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగిలిన మరో ఆర్మ్‌ (104 ఏరియా వైపు) పనులు డిసెంబరు 25వ తేదీనాటికి పూర్తిచేసి, అప్పర్‌ రోటరీని పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు ప్రకటించారు. ఆ తరువాత లోవర్‌ రోటరీ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నాలుగో ఆర్మ్‌ అనుసంధాన పనులు ఇప్పటికీ  పూర్తికాలేదు.  


లోవర్‌ రోటరీకి ఇంకెన్నాళ్లో?

 ఫ్లైఓవర్‌ అప్పర్‌  రోటరీ పూర్తయ్యాక లోవర్‌ రోటరీ నిర్మాణ పనులు చేపడతామని అధికారులు చెప్పారు.   ప్రస్తుతం వున్న రహదారితో పోలిస్తే ఫ్లైఓవర్‌ ఎత్తు చాలా తక్కువ వుంది. ఆర్టీసీ బస్సులు కూడా వెళ్లే పరిస్థితి లేదు. దీంతో లోవర్‌ రోటరీ కోసం రహదారిని ఐదారు అడుగుల మేర తవ్వి, కొత్తగా రహదారి నిర్మించాలన్నది ప్రణాళిక. కొద్ది రోజుల క్రితం ఈ పనులు ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతమంతా పెద్ద డంపింగ్‌ యార్డులా మారింది. ఇంతవరకు పది శాతం పనులు కూడా పూర్తికాలేదు. అప్పర్‌ రోటరీ అందుబాటులోకి రాకపోవడంతో  ఎన్‌ఎస్‌టీఎల్‌, గోపాలపట్నం, 104 ఏరియాల నుంచి ఎయిర్‌పోర్టు వైపునకు, అదే విధంగా ఎన్‌ఎస్‌టీఎల్‌ వైపు నుంచి గోపాలపట్నం వైపునకు వెళ్లే వాహనాలు ఫ్లైఓవర్‌ కింద నుంచి వెళ్లాల్సి వస్తున్నది. దీంతో తరచూ ట్రాఫిక్‌ స్తంభిస్తున్నది.


జనవరికి పూర్తి

రామమోహన్‌రావు, ఎస్‌ఈ, వీఎంఆర్‌డీఏ

అప్పర్‌ రోటరీ పనులు దాదాపు పూర్తయ్యాయి. లోవర్‌ రోటరీ పనులను జనవరినాటికి పూర్తిచేస్తాం. ఎర్త్‌ వర్క్‌, బీటీ, రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణం చేస్తే సరిపోతుంది. అప్పర్‌ రోటరీపై ఎప్పటి నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభించాలనేది ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవలసి ఉంది. 


Updated Date - 2020-12-28T05:45:55+05:30 IST