-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » What about the lands under cultivation by the farmers
-
రైతుల సాగులోని భూముల మాటేంటి?
ABN , First Publish Date - 2020-12-31T05:06:05+05:30 IST
సింహాచలం దేవస్థానం పరిధి పంచ గ్రామాల పరిధిలో రైతుల సా గులో ఉన్న భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.

పంచగ్రామాల పరిధిలోని అన్నదాతల ఆవేదన
క్రమబద్ధీకరణపై స్పష్టత ఇవ్వాలని వినతి
పెందుర్తిరూరల్, డిసెంబరు 30: సింహాచలం దేవస్థానం పరిధి పంచ గ్రామాల పరిధిలో రైతుల సా గులో ఉన్న భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం పరిధిలో నివేశన, ఆక్రమిత స్థలాలను త్వరలోనే క్రమబద్ధీకరిస్తామని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రకటించారు. కానీ మంత్రి ప్రకటనలో రైతులు సాగు చేస్తున్న భూముల ప్రస్తావన లేకపోవడంతో వారంతా అయోమయంలో పడ్డారు. పంచ గ్రామాలకు సంబంధించి 70వ వార్డు పరిధి చీమలాపలి పరిసర ప్రాంతాలలో సమారు 400 ఎకరాలకు పైగా భూములు స్థానిక రైతుల అధీనంలో ఉన్నాయి. ఒక్కో రైతు వద్ద 20 సెంట్లు మొదలుకొని రెండెకరాల వరకు ఉన్నాయి. శతాబ్దాలుగా ఈ భూములు వారి కుటుంబ సభ్యుల అధీనంలోనే ఉండడంతో వంశపారం పర్యంగా వాటిని సాగు చేస్తున్నారు. అయితే 1991 తరువాత ఈ భూములన్నీ సింహాచలం దేవస్థానానికి చెందినవంటూ అధికారులు రంగ ప్రవేశం చేయడంతో రైతులకు అవస్థలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో క్రయవిక్రయాలు ఆగిపోయాయి. అవసరాలకు కనీసం సెంటు భూమిని కూడా అమ్ముకోవడానికి అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. తమ స్వాధీనంలో ఉన్న స్థలాల్లో చిన్న షెడ్డు వేసుకోవడానికి కూడా దేవస్థానం అధికారులు అనుమతించకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు.
క్రమబద్ధీకరణపై చిగురిస్తున్న ఆశలు
తాజాగా నివేశన స్థలాలను క్రమబద్ధీకరిస్తామని మంత్రి ప్రకటించడంతో దేవస్థానం స్థలాలను కొనుగోలు చేసిన వారు, ఆక్రమణదారులు సంబరపడ్డారు. కానీ రైతుల అధీనంలో ఉన్న భూములపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వారంతా దిగాలు చెందుతున్నారు. తమ భూముల గురించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియని ఆందోళనతో సతమతమవుతున్నారు. వంశపారం పర్యంగా ఈ భూములనే సాగుచేస్తూ జీవిస్తున్నామని, దీనిపై ప్రభుత్వ పెద్దలు ఉదారంగా స్పందించి, చట్టపరంగా సాగులోని భూములన్నింటికీ వారసత్వ హక్కు కల్పించి, పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని ఈ పరిధిలోని రైతులంతా కోరుతున్నారు.