-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » We will create new villages with the distribution of house deeds
-
ఇళ్ల పట్టాల పంపిణీతో కొత్త గ్రామాలు రూపొందిస్తాం
ABN , First Publish Date - 2020-12-27T05:55:22+05:30 IST
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా సీఎం జగన్ ప్రభుత్వం కొత్త గ్రామాలను రూపొందిస్తోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
పద్మనాభం, డిసెంబరు 26: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా సీఎం జగన్ ప్రభుత్వం కొత్త గ్రామాలను రూపొందిస్తోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని అయినాడ, బీఆర్ తాళ్లవలస, బుడ్డివలస, రేవిడి, వెంకటాపురం గ్రామాల్లో శనివారం నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. నవరత్నాలలో ఈ కార్యక్రమం అతిపెద్ద రత్నమన్నారు. బీఆర్ తాళ్లవలసలో అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూముల రైతులకు పట్టాల మంజూరుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కలక్టర్‌ను కోరారు. కలక్టర్ వి.వినయ్‌చంద్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీలో ప్రతి లబ్ధిదారునికి ఇళ్ల పట్టాతో పాటు ఇల్లు మంజూరు పత్రాన్ని కూడా ఒకేసారి అందిస్తున్నామన్నారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 2.96 లక్షల మందికి పట్టాల పంపిణీ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించగా, కోర్టు వివాదాల వల్ల నగర పరిధిలోని 1.75 లక్షల మందికి ప్రస్తుతం ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నామన్నారు. ఈ సందర్భంగా బుడ్డివలసలోని లేఅవుట్‌లో 93 ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలక్టర్ వినయ్‌చంద్‌ను మంత్రి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో పెంచల కిశోర్, తహసీల్దార్ ఎ.శ్రీనివాసరావు, ఎంపీడీవో జీవీ చిట్టిరాజు, వైసీపీ నాయకులు కె.రాంబాబు, కె.పాపారావు, ఎస్.గిరిబాబు, కె.లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
పార్టీలకతీతంగా ఇళ్ల పట్టాలు
ఆనందపురం: పార్టీలకు అతీతంగా అర్హతను ప్రామాణికంగా చేసుకుని ఇళ్ల పట్టాల పంపిణీ చేపడుతున్నట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని పెద్దిపాలెం, వెల్లంకి, చందక, గొట్టిపల్లి, కుసులువాడ, ముచ్చర్ల, గిడిజాల పంచాయతీల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. అర్హులందరికీ పట్టాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.కిషోర్‌బాబు, వైసీపీ నాయకులు కోరాడ వెంకటరావు, బంక సత్యనారాయణ, కాకర్లపూడి వరహాలరాజు, మజ్జి వెంకటరావు, కాకర వెంకటరమణ, కంచరాపు శ్రీనివాసరావు, పిన్నింటి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.