జలం.. ఇలా ఉంటే కాదా గరళం!
ABN , First Publish Date - 2020-12-12T04:54:28+05:30 IST
పెందుర్తిలో చాలా చోట్ల మంచినీటి పైపులైన్లు డ్రైనేజీల్లోంచే ఏర్పాటు చేశారు. పైపులైన్లు మురుగునీటిలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి.
డ్రైనేజీల్లోనే మంచినీటి పైపులైన్లు
పలుచోట్ల మురుగునీటిలో మునిగి ఉన్న వైనం
పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం
ఏలూరు ఘటన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న జనం
పెందుర్తి, డిసెంబరు 11: పెందుర్తిలో చాలా చోట్ల మంచినీటి పైపులైన్లు డ్రైనేజీల్లోంచే ఏర్పాటు చేశారు. పైపులైన్లు మురుగునీటిలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి. పెందుర్తి పులగాలిపాలెం రోడ్డు, పెందుర్తి రాజుచెరువు, సాయినిరంజన్ కాలనీ, వెలంపేట ప్రాంతాల్లో డ్రైనేజీల్లోంచే పైపులైన్లు ఉన్నాయి. ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇక్కడి నుంచే ఇస్తున్నారు. ఇక పెందుర్తిలో తాటిపూడి పైపులైన్ల లీకేజీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏలూరు సంఘటన నేపథ్యంలో ఇక్కడ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వెంటనే డ్రైనేజీల్లోంచి పైపులైన్లు తొలగించి సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పరవాడలో..
పరవాడ : మండల కేంద్రం పరవాడ బొంకులదిబ్బ వీధి నుంచి సంతబయలుకు వెళ్లే ప్రధాన రహదారిలోని గానుగ మలుపు వద్ద ఇరువైపులా ఉన్న డ్రైనేజీల్లో మంచినీటి పైపులైన్లు ఉన్నాయి. ఏళ్ల తరబడి డ్రైనేజీల్లోనే ఇవి ఉన్నాయి. వీటి ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. ఇదే విషయాన్ని స్థానికులు అప్పట్లోనే పంచాయతీ అఽధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అయినా అధికారులు ఇంత వరకు స్పందించలేదు. గతంలో పైపులైన్లకు రంధ్రాలు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నెలల తరబడి పైపులైన్ల్లు లీకేజీలతోనే తాగునీటి సరఫరా జరిగేది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ అధికారులు మరమ్మతులు చేయించారు. ఇటీవల పైపులైన్ పగిలి మంచినీరు, డ్రైనేజీలోని మురుగునీరు కలిసిపోయేవి. అధికారులు కొత్త పైపులైన్‌ను అమర్చడంతో సమస్య పరిష్కారమైంది. అయితే పైపులైన్‌ను డ్రైనేజీలోంచే ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీల్లో ఉన్న పైపులైన్లను సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.