499 కిలోల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2020-12-29T05:57:45+05:30 IST
499 కిలోల గంజాయి పట్టివేత
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చోడవరం, డిసెంబరు 28: స్థానిక పోలీసులు సోమవారం వాహనాలను తనిఖీ చేస్తూ 499 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఏజెన్సీ నుంచి ఓ వాహనంలో గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం అందడంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్.ఐ. విభీషణరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు.
105 కిలోల గంధపు చెక్కలు స్వాధీనం
చోడవరం: ఏజెన్సీ ప్రాంతం నుంచి కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంధపు చెక్కలను సోమవారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్ ఎదుట వాహనాలు తనఖీ చేస్తుండగా ఒక కారు డిక్కీలో 105 కిలోల గంధపు చెక్కలను పోలీసులు గుర్తించారు. వీటితోపాటు కారును సీజ్ చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంధపు చెక్కల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ విభీషణరావు చెప్పారు.
మద్యం సీసాలతో ఇద్దరి అరెస్టు
కె.కోటపాడు: మండలంలోని ఆనందపురం చెక్‌పోస్ట్ మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎ.కోడూరు ఎస్‌ఐ బి.అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నీలకంఠరాజపురం గ్రామానికి చెందిన నిమిడితల్లి నాగమయ్య వద్ద తొమ్మిది మద్యం సీసాలు, ఎస్.కోట మండలం వెంకటరమణపేట గ్రామానికి చెందిన కనిమిశెట్టి శ్రీను వద్ద 23 మద్యం సీసాలు లభ్యమయ్యాయని, వీటిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
అచ్యుతాపురం: స్థానిక జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పూడి గ్రామానికి చెందిన సరుగుడు కర్రల వ్యాపారి పైల అచ్చిబాబు అచ్యుతాపురం జంక్షన్ నుంచి పూడిమడక రోడ్డులో మోపెడ్‌పై వెళ్తుండగా విశాఖపట్నం నుంచి సెజ్‌లో ఒక కర్మాగారానికి బొగ్గులోడుతో వస్తున్న లారీ ఢీకొంది. దీంతో అచ్చిబాబు కుడి కాలికి తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు.
చంపుతామని బెదిరించిన వారిపై కేసు నమోదు
నర్సీపట్నం: మండలంలోని చెట్టుపల్లి గ్రామానికి చెందిన మట్టా సతీశ్‌ని చంపుతామని బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసిన వారిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు రూరల్ ఎస్‌ఐ రమేశ్ తెలిపారు. రావికమతం మండలానికి చెందిన గుమ్మల ప్రసాద్ పంపించిన ఐదుగురు వ్యక్తులు సోమవారం సతీశ్ ఇంటికి వెళ్లి, ఆస్తి వివాదాన్ని సెటిల్ చేసుకోకపోతే చంపుతామని బెదిరించారు. అనంతరం కారులో బయలుదేరుతుండగా సతీశ్‌తోపాటు గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఇద్దరు పారిపోయారు. మిగిలిన ముగ్గురిని పోలీసులకు అప్పగించారు. సతీశ్ ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి, వంకర రాజారావు, గంగుపోగుల ఈశ్వరరావు, గొర్లె శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.