ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలి

ABN , First Publish Date - 2020-10-31T10:37:42+05:30 IST

పందుల పెంపకమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న తమకు ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని మందులు, ఎరుకుల తదితర దళిత బహుజనులు నినదించారు.

ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలి

 జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పందుల పెంపకం దారుల ఆందోళన 

ఆశీల్‌మెట్ట, అక్టోబరు 30 :  పందుల పెంపకమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న తమకు ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని మందులు, ఎరుకుల తదితర దళిత బహుజనులు నినదించారు. ఈ వృత్తిని జీవీఎంసీ రద్దు చేయాలనుకుంటే ముందుగా పందుల పెంపందారులను ఆదుకునే చర్యలను చేపట్టాలని పీవోడబ్ల్యు లక్ష్మి డిమాండ్‌. ఈ మేరకు శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో సుమారు వెయ్యి కుటుంబాలు పందుల పెంపకమే జీవనోపాధిగా బతుకుతున్నాయన్నారు. సుమారు 50 వేలకు పైగా పందులున్నాయన్నారు. గతంలో వీరికి పెందుర్తి వంటి సెంటర్లలో స్థలం కేటాయించారన్నారు. మధురవాడ, గాజువాక ప్రాంతాల్లో కూడా డంపింగ్‌ యార్డుల వద్ద ఏర్పాటు చేశారన్నారు. కేటాయించిన స్థలం నుంచి బయటకు వచ్చిన పందులను జీవీఎంసీ సిబ్బంది చంపుతున్నారన్నారు.


అంతేకాకుండా పెంపకందారులతో సంప్రదింపులు లేకుండా, నోటీసులు ఇవ్వకుండా పందుల్ని సజీవంగా పట్టుకుని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకునేందుకు తమిళనాడుకు చెందిన కొందరు వ్యాపారులకు ఇక్కడి అధికారులు అనుమతి ఇచ్చారన్నారు. వారు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అనంతరం న్యాయవాది గిరిధర్‌ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కుటుంబ పోషణ భారంగా మారిన నేపథ్యంలో ఉన్న ఉపాధిని పోగొట్టడం సరికాదన్నారు. పందుల పెంపకం చేపట్టకూడదని చట్టంలో ఎక్కడా లేదన్నారు. ఈ చర్యలు ఆపాలని, చట్టబద్ధమైన విధానం ద్వారా సమస్య పరిష్కరించాలన్నారు. ఈ నిరసనలో సీమాంధ్ర మందుల సంఘం అధ్యక్షుడు వాడపల్లి అప్పన్న, ప్రతినిధి దశర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T10:37:42+05:30 IST