నౌక తరలింపునకు 45 రోజులు!?
ABN , First Publish Date - 2020-10-28T09:13:59+05:30 IST
తీరానికి కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ నౌక ‘ఎంవీమా’ను..

పూర్తయిన 50 టన్నుల ఇంధనం తరలింపు
నైపుణ్యం ప్రదర్శించిన ఆయిల్ స్పిల్ రెస్క్యూ టీమ్
నౌకను లోపలకు పంపాలంటే కిందకు నీరు తీసుకురావాలి
డ్రెడ్జింగ్ చేయాల్సిన అవసరమూ రావొచ్చు!!
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): తీరానికి కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ నౌక ‘ఎంవీ మా’ను తిరిగి సముద్రంలోకి పంపడానికి కనీసం 45 రోజులు పడుతుందని పోర్టు వర్గాలు అంచనా వేస్తున్నాయి. అది అంత సులువైన పని కాదని, నిపుణుల పర్యవేక్షణలో జరగాల్సి వుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం మెరైన్ విభాగం వర్గాలు పేర్కొంటున్నాయి. నౌకలో గల 50 టన్నుల ఇంధనాన్ని తొలగించాకే నౌక తరలింపు పనులు చేపట్టాలని పర్యావరణవేత్తలు స్పష్టం చేయడంతో విశాఖపట్నం పోర్టు ‘ఆయిల్ స్పిల్ రెస్క్యూ టీమ్’ను రంగంలోకి దింపింది. క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న పోర్టుల్లో పొరపాటున ఆయిల్ సముద్రంలో లీకైతే...పర్యావరణానికి, జీవ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
అటువంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే ఆయిల్ తెట్టును సురక్షితంగా తొలగించడానికి మూడేళ్ల క్రితమే కేంద్రం ఆదేశాల మేరకు విశాఖపట్నం పోర్టులో ‘ఆయిల్ స్పిల్ రెస్క్యూ టీమ్’ను ఏర్పాటుచేశారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఆ టీమ్‌కు పోర్టు అధికారులు బంగ్లా నౌక బాధ్యతలు అప్పగించారు. కెరటాల ఉధృతికి నౌక రాళ్లకు కొట్టుకొని అందులోని ఆయిల్ బయటకు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఆయిల్ తరలించేప్పుడు ఎటువంటి నైపుణ్యం ప్రదర్శించాలనే అంశాల్లో ఈ టీమ్ సహాయపడింది. మొత్తానికి వారం రోజుల నిరంతర సాధనతో ఇంధనం తరలింపు పూర్తయింది.
నౌక కిందకు నీరు కావాలి
బంగ్లా నౌక తీరంలో రాళ్ల మధ్య చిక్కుకుంది. ప్రస్తుతం 50 టన్నుల ఆయిల్ భారం తగ్గడంతో కొంచెం పైకి లేచింది. అయితే రాళ్ల మధ్య నుంచి లాక్కొంటూ తీసుకువెళితే నౌక దెబ్బతింటుంది. ఇప్పుడు నౌక ఇంజన్లు పనిచేస్తున్నాయి. కాబట్టి నౌక కింద నీళ్లను తీసుకువెళ్లగలిగితే...ఆ తరువాత ఇంజన్ ఆన్ చేసి నేవిగేషన్ టెక్నాలజీతో సముద్రంలోకి సులువుగా తీసుకుపోవచ్చు. అయితే, నౌక పైకి తేలేంత నీరు ఇప్పుడు అక్కడకు రావాలి. సహజసిద్ధంగా అది జరగదు. అందుకోసం నౌక చుట్టుపక్కల రాళ్లను తొలగించడం, ఇసుకను తీయడం వంటి పనులను డ్రెడ్జింగ్ ద్వారా చేపట్టి...ఆ ప్రాంతంలోకి ఎక్కువ నీరు వచ్చేలా చేయాల్సి ఉంది.
ప్రస్తుతం దీనిపై రెస్క్యూ బృందం దృష్టిపెట్టింది. ఎంత లోతున తవ్వాలి? అక్కడ ఎన్ని రాళ్లు ఉన్నాయి? అనేది పరిశీలిస్తున్నారు. డ్రెడ్జింగ్ ద్వారా నౌక నీటిపై తేలేందుకు అవసరమైన లోతు చేసి, ఆ తరువాత దానిని నెమ్మదిగా టగ్‌ల సాయంతో సముద్రంలోకి తీసుకువెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సుమారు రూ.300 కోట్ల విలువైన ఈ నౌకను సురక్షితంగా మళ్లీ సముద్రంలోకి పంపడానికి భారీగానే ఖర్చు చేస్తున్నారు.