కరోనా రీ టెస్ట్‌

ABN , First Publish Date - 2020-10-13T10:22:03+05:30 IST

కరోనా నిర్ధారణ పరీక్షల సందర్భంగా చూపిన చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల వేలాది మందికి మళ్లీ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే....

కరోనా రీ టెస్ట్‌

లక్షణాలున్నా...యాంటీజెన్‌ పరీక్షలో 20,000 మందికి నెగెటివ్‌ రాక

ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం వారికి ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయాలి

...అలా చేయకుండా వివరాలు పంపించిన అధికారులు

వారందరికీ మళ్లీ పరీక్ష చేయాలని సూచించిన ఐసీఎంఆర్‌

మూడు రోజులుగా 15 వేల మందికి పరీక్షలు..300 మందికి పాజిటివ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కరోనా నిర్ధారణ పరీక్షల సందర్భంగా చూపిన చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల వేలాది మందికి మళ్లీ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే....జిల్లాలో గడచిన 14 రోజుల వ్యవధిలో సుమారు 70 వేల మందికి అధికారులు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌తోపాటు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు ఉన్నాయి. పరీక్షలు చేయించుకోవడానికి ముందు అనుమానిత వ్యక్తి అడ్రస్‌తోపాటు కరోనాకు సంబంధించి లక్షణాలను ఒక పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది.


ఈ విధంగా పొందుపరిచిన వివరాలు, వారి ఫలితాలను ఐసీఎంఆర్‌కు జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు. ఇలా పంపిన వివరాలను ఐసీఎంఆర్‌ అధికారులు క్రోడీకరించగా...సుమారు 20 వేల పరీక్షలు ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా వున్నట్టు గుర్తించారు. మరోసారి వారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. 


నెగిటివ్‌ వస్తే..ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష..

ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం కరోనా లక్షణాలు వుండి..ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చినా...వారికి తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయాలి. అయితే, జిల్లాలో గత 14 రోజుల్లో సుమారు 70 వేల మందికి పరీక్షలు నిర్వహించగా..వీటిలో 50 వేల వరకు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్స్‌తో చేసిన పరీక్షలు ఉన్నాయి. ఇందులో సుమారు 20 వేల మందికి సంబంధించిన  అప్లికేషన్‌లలో పాజిటివ్‌ లక్షణాలు వున్నట్టు నమోదు చేయగా...ఫలితం మాత్రం నెగిటివ్‌గా వచ్చింది.


ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం వారందరికీ మళ్లీ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయాలి. అధికారులు అలా చేయకుండా యథావిధిగా వివరాలను పంపించేశారు. దీన్ని గుర్తించిన అధికారులు..వెంటనే వారందరికీ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయాలని సూచించారు. దీంతో జిల్లా అధికారులు సదరు 20 వేల మందికి గత మూడు రోజుల నుంచి మరోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 15 వేల మందికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా, 300 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


మరో ఐదు వేల మందికి పరీక్షలు నిర్వహించాల్సి వున్నదని కొవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. పరీక్షల సమయంలో సిబ్బంది ఒత్తిడి, తదితర కారణాల వల్ల లక్షణాలు లేకపోయినా..లక్షణాలున్నట్టు పేర్కొనడంతో ఈ సమస్య తలెత్తిందని ఆయన తెలిపారు. ఇప్పటికే వారందరికీ వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-13T10:22:03+05:30 IST