-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » vsp news
-
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రథమ స్థానమే ధ్యేయం కావాలి
ABN , First Publish Date - 2020-10-07T11:14:10+05:30 IST
నగరంలోని వార్డు సచివాలయ శానిటరీ సెక్రటరీలు నిబద్ధతతో పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన స్పష్టం చేశారు.

శానిటరీ సెక్రటరీలు నిబద్ధతతో పనిచేయాలి
జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన
వెంకోజీపాలెం, అక్టోబరు 6: నగరంలోని వార్డు సచివాలయ శానిటరీ సెక్రటరీలు నిబద్ధతతో పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన స్పష్టం చేశారు. మంగళవారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్‌లో వార్డు సెక్రటరేట్‌లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2021లో విశాఖను స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రథమ స్థానంలో నిలబెట్టడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. సీఎం జగన్ విప్లవాత్మకమైన మార్పు కోసం వార్డు సెక్రటరేట్ వ్యవస్థను స్థాపించారని, దీని లక్ష్య సాధన కోసం అందరం క్రమశిక్షణతో పనిచేయాలన్నారు.
ప్రతీ వార్డు సచివాలయ ఉద్యోగి వద్ద తప్పనిసరిగా ఆ వార్డు వివరాలు ఉండాలని, ప్రతి వార్డు సెక్రటరీ సచివాలయం లేదా వార్డు పరిధిలో నివాసముండాలని పేర్కొన్నారు. రోజూ ఉదయం పదిగంటల్లోగా కాలువలు, రోడ్లు శుభ్రం కావాలని, డస్ట్‌బిన్స్ పదిన్నరలోపు క్లీన్ అవ్వాలని సృజన సూచించారు. రోజుకొక అధికారి సచివాలయాలను సందర్శిస్తారని, సిబ్బంది హాజరు, మూవ్‌మెంట్ రిజిష్టరును విధిగా చూపాలని, సెలవు పెడితే తమ లీవ్ లెటర్‌ను శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎవరైనా రోడ్డుపై చెత్త, బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ వేస్తే జరిమానా విధించాలన్నారు. ఈ సందర్భంగా పలువురి వార్డు సెక్రటరీల సందేహాలను సృజన నివృత్తి చేశారు. ఈ సమావేశంలో ఏడీసీ డాక్టర్ వి.సన్యాసిరావు, సీఎంవోహెచ్ డాక్టర్ కేఎస్‌ఎల్‌జీ శాస్ర్తి, తదితరులు పాల్గొన్నారు.