హాజరు అంతంతమాత్రం

ABN , First Publish Date - 2020-10-07T11:08:39+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో 9, 10 తరగతుల విద్యార్థులు సందేహ నివృత్తి కోసం..

హాజరు అంతంతమాత్రం

సగం కంటే తక్కువగానే విద్యార్థుల రాక

గ్రామీణంలో కొంచెం ఎక్కువ

నగరంలో 25 నుంచి 30 శాతం

మాస్క్‌ తప్పనిసరి చేసిన అధికారులు

ఒక్కోచోట బెంచీకి ముగ్గురు విద్యార్థులను కూర్చోబెడుతుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నేపథ్యంలో 9, 10 తరగతుల విద్యార్థులు సందేహ నివృత్తి కోసం..అదీ తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలకు హాజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంటోంది. గత నెల 21న పాఠశాలలను తెరవగా...మొదట ఒకటి, రెండు వారాలు 15 నుంచి 20 శాతం మందే వచ్చారు. తరువాత క్రమంగా పెరిగి ప్రస్తుతం 40 నుంచి 45 శాతం వరకు వస్తున్నారు. కొన్నిచోట్ల ఒకపూట మాత్రమే విద్యార్థులు వస్తుండగా, మరికొన్ని పాఠశాలల్లో ఉదయం ఒకటి, రెండు గంటలు, మధ్యాహ్నం ఒక గంట ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు.


కాగా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థుల హాజరు 40-45 శాతం వుంటుండగా, నగరంలో మాత్రం 25 నుంచి 30 శాతం వరకు వుంటున్నట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. చంద్రంపాలెం పాఠశాలలో 9, 10 తరగతుల్లో 600 మంది చొప్పున విద్యార్థులు వుండగా వారిలో 150 నుంచి 200 మంది వరకూ విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం పూట బాలికలు, మధ్యాహ్నం బాలురు తరగతులకు వస్తున్నట్టు ప్రధానోపాధ్యాయుడు రాజబాబు తెలిపారు. 


అయితే కొన్నిచోట్ల భౌతిక దూరం పాటిస్తుండగా, మరికొన్నిచోట్ల ఒకే బెంచీలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ప్రతి పాఠశాలలో విద్యార్థులు మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ మాస్కుతో రాకపోతే వెనక్కి పంపడం లేదా పాఠశాలలో మాస్క్‌ వుంటే ఇవ్వడం చేస్తున్నారు. శానిటైజర్‌ విషయంలో కొందరు ప్రధానోపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోగా, మరికొన్నిచోట్ల అటువంటి ఏర్పాట్లు లేవు.


అక్కడక్కడా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. కాగా విజయనగరం జిల్లాలో పలువురు విద్యార్థులకు కొవిడ్‌ రావడంతో విశాఖ జిల్లాలో విద్యా శాఖ అప్రమత్తమైంది. సోమవారం ఉదయం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో డీఈవో బి.లింగేశ్వరరెడ్డి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మాస్క్‌ వుంటేనే విద్యార్థులను అనుమతించాలని ఆదేశించారు. పాఠశాలల్లో శానిటైజర్‌ కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బంది వస్తే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాల్సి వుంటుందని స్పష్టంచేశారు.

Updated Date - 2020-10-07T11:08:39+05:30 IST