ప్రహరీ కూల్చివేత కక్ష సాధింపే..
ABN , First Publish Date - 2020-10-04T11:18:50+05:30 IST
నాడు తండ్రి దివంగత వైఎస్ హయాంలో సక్రమమైన ఇంటి నిర్మాణం... నేడు తనయుడు సీఎం వైఎస్
నాడు సక్రమమైన నిర్మాణం నేడు అక్రమమా?
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు
వెంకోజీపాలెం, అక్టోబరు 3: నాడు తండ్రి దివంగత వైఎస్ హయాంలో సక్రమమైన ఇంటి నిర్మాణం... నేడు తనయుడు సీఎం వైఎస్ జగన్ హయాంలో అక్రమమవ్వడం కేవలం టీడీపీ నాయకులపై కక్ష్య సాధింపు చర్యలేనని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దుయ్యబట్టారు. శనివారం ఏపీఎస్‌ఈబీ కాలనీలోని మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటి గోడను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేయడంతో వెలగపూడి, టీడీపీ నాయకుడు ఎం.శ్రీభరత్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఇతర నాయకులు ఆయనను పరామర్శించారు.
కేవలం టీడీపీ నాయకులపై జగన్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, బెదిరించి పార్టీలోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. నిర్మాణం జరిగిన సుమారు 15 ఏళ్ల తర్వాత అక్రమ నిర్మాణమంటూ ప్రహరీని కూల్చివేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంటే కార్యకర్తలు, అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుగత సత్యనారాయణ, బోర ధనరెడ్డి, ఆళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.