కొత్త మీటర్లు ఏర్పాటు

ABN , First Publish Date - 2020-10-04T11:08:41+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) కొత్త మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది.

కొత్త మీటర్లు ఏర్పాటు

విద్యుత్‌ రీడింగ్‌ నమోదులో అవకతవకలను నియంత్రించేందుకే?

బిల్లింగ్‌ కచ్చితంగా అవుతుందంటున్న అధికారులు

అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ వర్క్‌ పూర్తయిన ప్రాంతంలో స్మార్ట్‌ మీటర్లు

తొలివిడతలో 54 వేలకు టెండర్లు

ఇవన్నీ ప్రీపెయిడ్‌ ఏపీఈపీడీసీఎల్‌ కసరత్తు


(విశాఖపట్నం-ఆంధ్రప్రదేశ్‌)

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) కొత్త మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం వున్న విద్యుత్‌ మీటర్ల నుంచి ఆపరేటర్లు నెల నెలా ఇళ్లకు వెళ్లి రీడింగ్‌ తీస్తున్నారు. వీరిలో కొందరు వినియోగదారులతో కుమ్మక్కై తప్పుడు రీడింగ్‌లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ వినియోగం చూపితే...శ్లాబ్‌ మారిపోయి బిల్లు ఎక్కువ వస్తుందని, ఆ శ్లాబుకు తక్కువగా విద్యుత్‌ వినియోగించినట్టు బిల్లులు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ఆపరేటర్లు ఇళ్లకు వెళ్లకుండానే ఏదో ఒక చెట్టు కింద కూర్చొని అంచనాల ప్రకారం బిల్లులు ఇచ్చేస్తున్నారు.


దీనివల్ల ఏ నెలకు ఆ నెల వినియోగించిన విద్యుత్‌కు తగిన బిల్లులు సంస్థకు రావడం లేదు. ఈ సమస్యను నివారించడానికి ఏపీఈపీడీసీఎల్‌ కొత్తగా డివైజ్‌ లాంగ్వేజ్‌ మెసేజ్‌ స్పెసిఫికేషన్‌ (డీఎల్‌ఎంఎస్‌) మీటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మీటర్ల నుంచి మాన్యువల్‌గా రీడింగ్‌ నమోదుచేయడం కుదరదు. ఆపరేటర్‌కు స్కానర్‌తో కూడిన మెషీన్‌ ఇస్తారు. దానికి ఇన్‌ఫ్రా రెడ్‌ పోర్టు ఉంది. అలాగే మీటరులో కూడా దానిని రిసీవ్‌ చేసుకునే పోర్టు ఉంటుంది.


మీటరుకు ఐదు అడుగుల దూరంలో ఈ స్కానర్‌ను పెట్టగానే ఆటోమేటిక్‌గా అందులో రీడింగ్‌ను నమోదుచేసి నేరుగా కార్పొరేట్‌ ఆఫీసులో వుండే సర్వర్‌కు పంపుతుంది. అలాగే అడ్జెస్ట్‌మెంట్‌ చేయడానికి వీలులేకుండా వెంటనే బిల్లు వచ్చేస్తుంది. వినియోగదారునికి కూడా మెసేజ్‌ వెళ్లిపోతుంది.  


యూజీ కేబుల్‌ వేసిన ప్రాంతంలో స్మార్ట్‌ మీటర్లు

నగరంలోని పలు ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ వేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల పనులు పూర్తిచేసి కనెక్షన్లు ఇచ్చారు. అలాంటి గృహాలు అన్నింటికీ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నిధులతో టెండర్లు పిలిచారు. తొలి విడత 54 వేలు తెప్పిస్తున్నారు. ఈ స్మార్ట్‌ మీటర్ల వినియోగదారులకు విద్యుత్‌ అంతరాయాల గురించి, లోడ్‌ గురించి ఎప్పటికప్పుడు మెసేజ్‌లు వస్తాయి. ఇవన్నీ ప్రీపెయిడ్‌ మీటర్లు.


మొబైల్‌ రీచార్జిలాగే వీటిని రీచార్జ్‌ చేసుకోవాలి. ఎంత బ్యాలెన్స్‌ వుందో చూపిస్తుంది. పీక్‌లోడ్‌లో రాత్రి 6 నుంచి 9 గంటల వరకు ఎంత విద్యుత్‌ వస్తుందో చెబుతుంది. దానివల్ల ఆ సమయంలో ఏసీల వాడకం నియంత్రించుకోవచ్చు. అయితే వీటిని అందరికీ అమర్చరు. నెలకు 500 యూనిట్లు దాటి వినియోగించే వారికి కోరితే ఇస్తారు. ఎటువంటి చార్జీ వసూలు చేయరు. ఇది వినియోగదారుల ఆప్షన్‌.


డీఎల్‌ఎంఎస్‌ మీటర్లపైనే దృష్టి: బి.రమేశ్‌ప్రసాద్‌, డైరెక్టర్‌, ఆపరేషన్స్‌

ప్రస్తుతం డీఎల్‌ఎంఎస్‌ మీటర్ల ఏర్పాటు పూర్తిచేయడంపై దృష్టి పెట్టాము. సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల్లో వ్యవసాయేతర (గృహ, పారిశ్రామిక) కనెక్షన్లు 59 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పటివరకు డీఎల్‌ఎంఎస్‌ మీటర్లు 55.07 లక్షలు అమర్చాము. ఇంకో నాలుగు లక్షల మీటర్లు ఏర్పాటు చేయాల్సి ఉం ది. రెండు, మూడు నెలల్లో ఆ పని కూడా పూర్తవుతుంది. అప్పటి నుంచి విద్యుత్‌ రీడింగ్‌ కచ్చితంగా నమోదవుతుంది. తద్వారా వినియోగించిన విద్యుత్‌కు తగినట్టు బిల్లింగ్‌ జరిగి, ఆదాయం పెరుగుతుంది. ఈ మీటర్లకు వినియోగదారుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదు. అంతా సంస్థే భరిస్తోంది. 

Updated Date - 2020-10-04T11:08:41+05:30 IST