అనుమానాస్పద స్థితిలో గిరిజన యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-10-03T09:18:46+05:30 IST

అనుమానాస్పద స్థితిలో గిరిజన యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో గిరిజన యువకుడి మృతి

జూదం ఆడే ప్రాంతానికి వెళ్లి సెల్ఫీ దిగడంతో

అక్కడున్న వారు గొంతు నులిపి చంపారని ప్రచారం


జి.మాడుగుల, అక్టోబరు 2: విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం వంజంగి పంచాయతీ పద్మాపురం గ్రామానికి చెందిన సారె సుమన్‌ (24) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పద్మాపురం గ్రామానికి చెంది సారె సుమన్‌ గురువారం చింతపల్లి మండలం లంబసింగి సంతకు వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. తర్వాత తాజంగి సమీపంలో జరుగుతున్న కోడిపందాలు చూసేందుకు వెళ్లాడు. అనంతరం గ్రామస్థులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో వెనుకబడ్డాడు. అతనితో వెళ్లిన వారంతా ఇళ్లకు చేరుకున్నారు. అయితే శుక్రవారం ఉదయానికి సుమన్‌ గొందిమెలక అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు.


దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. అతడి ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని, ఆత్మహత్యో, హత్యో నిర్ధారణ కావడం లేదన్నారు. సుమన్‌ మృతికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే తమకు తెలపాలని ఎస్‌ఐ ఉపేంద్ర కోరారు. అయితే సుమన్‌ జూదం ఆడే ప్రాంతానికి వెళ్లాడని, అక్కడ సెల్ఫీ దిగాడని, దాంతో ఆ సమయంలో అక్కడ వున్నవారు గొంతు నులిపి చంపేశారని ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2020-10-03T09:18:46+05:30 IST