ఏయూలో ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2020-10-03T09:09:18+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయులకు పదవులను కట్టబెడుతున్నారని, ఇందులో భాగంగా లేని పదవులను సృష్టించి మరీ రిటైర్ట్‌ ప్రొఫెసర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారని సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఏయూలో ఇష్టారాజ్యం


అస్మదీయులకు ఇన్‌చార్జి వీసీ అందలం

కొన్నిచోట్ల లేని పోస్టులు సృష్టించి మరీ నియామకం

మరికొన్నిచోట్ల ఉన్న వారిని ఉన్నఫలంగా తొలగిస్తున్న వైనం

సీనియర్ల ప్రొఫెసర్‌ల గుస్సా

రిటైర్డ్‌ ప్రొఫెసర్లకు బాధ్యతల అప్పగింతపై అసహనం

ఆర్థిక అవకతవకలపై హైకోర్టు నోటీసులపైనా ఆందోళన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)  :

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయులకు పదవులను కట్టబెడుతున్నారని, ఇందులో భాగంగా లేని పదవులను సృష్టించి మరీ రిటైర్ట్‌ ప్రొఫెసర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారని సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా యూనివర్సిటీ ప్రతిష్ఠ మసకబారేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. 


విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీగా వున్న ప్రసాదరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయులకు పదవులను కట్టబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పోస్టులను సృష్టించి, మరికొన్నిచోట్ల వున్న వారిని తొలగించి తన వారికి అవకాశం కల్పించారని చెబుతున్నారు. ప్రస్తుతం వర్సిటీలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొద్దిరోజులుగా సాగుతున్న ఈ వరుస పదవుల పందేరం హాట్‌ టాపిక్‌గా మారింది. 


పదవుల పందేరం సాగిందిలా...

గతంలో ఎన్నడూ లేని విధంగా యోగా విలేజ్‌కు గౌరవ డైరెక్టర్‌గా ఓ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ను నియమించారు. యోగాతో సంబంధం లేని డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టడంపై తీవ్ర విమర్శలు రేగాయి. ఇప్పటివరకు అక్కడ డైరెక్టర్‌ మాత్రమే విధుల్లో వుండగా, తాజాగా గౌరవ డైరెక్టర్‌ పదవిని సృష్టించడం గందరగోళానికి కారణమైంది. ఇద్దరు అధికారులు వుండడంతో ఎవరి బాధ్యతలు ఏమిటి..? అన్న దానిపై వారికే స్పష్టత లేకపోగా, సిబ్బందిలోనూ అయోమయం నెలకొంది.


అదేవిధంగా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ప్రొఫెసర్‌కు మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ పదవిని సృష్టించి బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గతంలో ఇంజనీరింగ్‌ కాలేజీలో పనిచేసిన ప్రొఫెసర్‌కు సెంటర్‌ ఫర్‌ నానో టెక్నాలజీ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించేవారు. అయితే ఈ విధానానికి స్వస్తి చెప్పి కొత్తగా ఈ విభాగంతో సంబంధం లేని వ్యక్తికి ఆ పదవిని ఇచ్చారు. అలాగే సెంటర్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ డైరెక్టర్‌గా ప్రస్తుత వీసీ డిపార్టుమెంట్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ పనిచేస్తున్నారు.


మూడేళ్ల పదవీ కాలంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే కొద్దిరోజుల కిందట సదరు ప్రొఫెసర్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించి మాజీ రిజిస్ట్రార్‌కు కట్టబెట్టారు. ఈ నిర్ణయం పట్ల కొంతమంది సీనియర్‌ ప్రొఫెసర్లు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కంప్యూటర్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా గతంలో అదే విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ను నియమించేవారు. తాజాగా ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌కు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌గా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌కు బాధ్యతలు అప్పగించారు. యూనివర్సిటీలోని పలు కీలక స్థానాల్లో ఇలా రిటైర్డ్‌ ప్రొఫెసర్లను నియమించడం పట్ల తీవ్ర చర్చ సాగుతోంది. గతంలో లేని సంప్రదాయాలను అడ్డగోలుగా ప్రవేశపెట్టడం మంచి పద్ధతి కాదని పలువురు పేర్కొంటున్నారు. 


హైకోర్టు నోటీసులపైనా ఆందోళన

యూనివర్సిటీలో అవకతవకలపై విద్యార్థి సంఘ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వాటికి సంబంధించిన వివరాలను అందించాలని యూనివర్సిటీ అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపైనా పలువురు సీనియర్‌ ప్రొఫెసర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వల్లే విద్యార్థి సంఘ నేతలు కోర్టును ఆశ్రయించేందుకు ఆస్కారం కలిగించిందంటున్నారు. 


ముఖ్యంగా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రీవాల్యూయేషన్‌ పేరుతో భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, అర్హత లేని వారిని పాస్‌ చేయించడం యూనివర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చిందని ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వివాదాస్పద నిర్ణయాలను పక్కనపెట్టాలని సూచిస్తున్నారు. 

Updated Date - 2020-10-03T09:09:18+05:30 IST