-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » vsp
-
ప్రాదేశికాల్లో వైసీపీ బోణీ!
ABN , First Publish Date - 2020-03-13T11:37:53+05:30 IST
ప్రాదేశికాల్లో వైసీపీ బోణీ!

ఇంజరి ఎంపీటీసీ స్థానంలో ఒక్కరే నామినేషన్
గుమ్మకోట, రాజుపేట, రాజుకోడూరుల్లో దాదాపు ఏకగ్రీవమే...
పరిశీలన అనంతరం వైసీపీ అభ్యర్థులతోపాటు డమ్మీల నామినేషన్లు మాత్రమే సరైనవిగా నిర్ధారించిన అధికారులు
గుమ్మకోటలో టీడీపీ, బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కృతి
చోడవరం మండలం లక్ష్మీపురంలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కృతి
మిగిలింది వైసీపీ అభ్యర్థి, డమ్మీ మాత్రమే
ఆర్డీఓకు అప్పీలు చేస్తానన్న టీడీపీ అభ్యర్థి
విశాఖపట్నం, మార్చి 12: జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ గురువారం సాయంత్రంతో ముగిసింది. వివిధ కారణాలు, నిబంధల మేరకు పలువురు అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. కొన్నిచోట్ల ప్రధాన పార్టీ అభ్యర్థితోపాటు ఆ పార్టీకి చెందిన డమ్మీ అభ్యర్థులు మాత్రమే వున్నారు. ఇటువంటివి జిల్లాలో నాలుగు స్థానాల వరకు వున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఒక్క అభ్యర్థి మాత్రమే రంగంలో వుంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
పెదబయలు మండలం ఇంజరి ఎంపీటీసీ స్థానానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. గవుడుపుట్టు గ్రామనికి చెందిన పాంగి సత్యవతి వైసీపీ అభ్యర్థినిగా నామినేషన్ వేశారు. ఆమె ఎన్నిక లాంఛనమే.
అనంతగిరి మండలం గుమ్మకోట స్థానానికి టీడీపీ, బీజేపీ అభ్యర్థులు, వారికి డమీలుగా వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వైసీపీకి చెందిన కెలాయ్ తవిటినాయుడుతోపాటు అతని కుటుంబానికి చెందిన మరో ఇద్దరు డమ్మీలు నామినేషన్లు వేశారు. ఇక్కడ కూడా ఏకగ్రీవ ఎన్నిక అవుతుందని చెబుతున్నారు.
రాంబిల్లి మండలం రాజుకోడూరు ఎంసీటీసీ స్థానం కూడా వైసీపీకి ఏకగ్రీవం అయినట్టే! వైసీపీ అభ్యర్థిగా పారిపిల్లి వెంకటరావు, డమ్మీగా అతని కుమారుడు శివాజీ నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర పార్టీలుగానీ, స్వతంత్రులుగానీ నామినేషన్లు వేయలేదు. దీంతో వైసీపీ ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకున్నట్టేనని చెబుతున్నారు.
కోటవురట్ల మండలం రాజుపేట ఎంపీటీసీ స్థానానం కూడా ఏకగ్రీవం కానున్నది. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. గ్రామంలోని రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు సమావేశమై, ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి చెందిన యల్లపు గీతాగాయత్రిని బరిలోకి దింపారు. ఆమెకు డమ్మీగా ఆమె అత్త తాయారు నామినేషన్ వేశారు. ఈ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడినట్టే.