వైసీపీ అడ్డదారులు!

ABN , First Publish Date - 2020-03-13T11:37:09+05:30 IST

వైసీపీ అడ్డదారులు!

వైసీపీ అడ్డదారులు!

అత్యధిక ఎంపీటీసీ స్థానాలను చేజిక్కించుకోవడానికి తీవ్రప్రయత్నాలు

అధినేత చెప్పిన 90 శాతంకన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా

తొలుత ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి

ప్రత్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా పలుచోట్ల ఒత్తిళ్లు

ఉపాధి పనులు బిల్లులు క్లియర్‌ చేయిస్తామని టీడీపీ నేతలకు ఎర

సామ, దాన, భేద దండోపాయాలు ప్రయోగం

కానిపక్షంలో పోలింగ్‌ ఏకపక్షంగా జరిగేలా ప్రణాళిక

ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రజాప్రతినిఽధులు, సీనియర్‌ నేతలు


విశాఖపట్నం/ చోడవరం, మార్చి 12: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతానికిపైగా సీట్లు సాధించాలని వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి జారీ చేసిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలన్న పట్టుదలతో ఆ పార్టీ జిల్లా నేతలు పావులు కదుపుతున్నారు. తొలుత జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి ప్రణాళికను రూపొందించినట్టు తెలిసింది. నామినేషన్ల దాఖలుకు ముందు నుంచే దీనిని అమలు చేయడం మొదలుపెట్టారు. నామనేషన్ల ఉపసంహరణ సమయంలో దీనిని మరింత పక్కాగా అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీంగా ఎన్నిక అయ్యేలా సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. తరువాత మిగిలిన స్థానాల్లో పోటీలో వున్న ప్రత్యర్థులను నయనో భయానో కట్టడి చేసి, పోలింగ్‌ రోజున పైచేయి సాధించేలా ప్రణాళికను రూపొందించినట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థులపై ఎక్కువ దృష్టి సారించినట్టు సమాచారం.


గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో వున్న అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న వైసీపీ.... ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో ఏకపక్షంగా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నది. పార్టీ అధినేత జగన్‌ ఆదేశాల మేరకు ఒక ప్రణాళికను రూపొందించుకుని, ఎన్నికల్లో ముందుకు వెళుతున్నారు. 90 శాతానికిపైగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని, తద్వారా జిల్లాలోని అన్ని ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్‌ పదవులను చేజిక్కించుకోవడానికి రకరకాలుగా తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు ముందే పలు ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచేలా పావులు కదిపారు. కొన్నిచోట్ల విజయం సాధించారు. ఈ ప్రకారం నాలుగైదు స్థానాలు ఇప్పటికే ఆ పార్టీ ఖతాలో పడ్డాయి. నామినేషన్ల ఉపసంహరణకు శనివారం సాయంత్రం వరకు గడువు వుంది. వైసీపీ కాకుండా ఇతర పార్టీల అభ్యర్థులు ఒకరిద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసిన ఎంపీటీసీలపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నయనో భయానో ఆయా అభ్యర్థులను లొంగదీసుకుని, నామినేషన్లు ఉపసంహరించునేలా చేసి, తమ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడానికి చర్యలు చేపట్టారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో బలంగా వున్న టీడీపీపై దృష్టి సారించారు.  ఆ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఉపాధి హామీ పథకం కింద నామినేషన్‌ విధానంలో అభివృద్ధి పనులు చేసిన నాయకులకు ఇంతవరకు బిల్లులు రాలేదు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇస్తే, మీ పెండింగ్‌  బిల్లులు మంజూరు చేయిస్తామని చెబుతున్నారు. ఒకవేళ ఇందుకు అంగీకరించని నేతలను... ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తే, బిల్లులు మంజూరు అయ్యే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నట్టు చోడవరం నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నేత వాపోయారు. దీంతో టీడీపీకి చెందిన పలువురు నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండడం లేదా ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోకుండా నిశ్శబ్దంగా వుండడం చేస్తున్నారు.

 ఎన్నికల్లో పోటీ చేస్తే... అధికార పార్టీకి తాము టార్గెట్‌ కావడమే కాకుండా పెండింగ్‌ బిల్లులపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు వాపోయారు. అదే స్థానిక ఎన్నికల్లో సహకరిస్తే, తరువాత ఏదో విధంగా బిల్లులు మంజూరు చేయించుకోవచ్చని చెబుతున్నారు.


ఏకగ్రీవాలు కానిచోట్ల....

ఎంపీటీసీ స్థానాలు తమకు అనుకూలంగా ఏకగ్రీవం కానిపక్షంలో ‘ప్లాన్‌ బీ’ని అమలు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. కొత్తగా తీసుకువచ్చిన చట్టం ప్రకారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎక్కడైనా చిన్నపాటి నిబంధన ఉల్లంఘన జరిగినా... వెంటనే రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలని ప్రణాళికను రూపొందించారు. ఇదే సమయంలో ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ‘తగిన చర్యలు’ చేపడతారు. ఇక పోలింగ్‌ రోజున తమ పార్టీకి ఏకపక్షంగా ఓటింగ్‌ జరిగేలా గ్రామ వలంటీర్లను వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొత్తం మీద అధినేత విధించిన ‘ఫలితాల టార్గెట్‌’ను మించి విజయాలు సాధించాలన్న పట్టుదలతో వున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-03-13T11:37:09+05:30 IST