ఏజెన్సీలో ‘దారి పెళ్లి’

ABN , First Publish Date - 2020-03-13T11:30:44+05:30 IST

ఏజెన్సీలో ‘దారి పెళ్లి’

ఏజెన్సీలో ‘దారి పెళ్లి’

వధూవరులకు జాతక దోషం ఉందని రహదారిపై వివాహం 


చింతపల్లి, మార్చి 12 : మండలంలోని చెరుకుంపాకలు-చింతపల్లి ప్రధాన రహదారిలో గురువారం ఆదివాసీ యువతీ, యువకులకు గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజారులు దారి పెళ్లి జరిపించారు. వధూవరుల జాతకంలో దోషం వుందని పూజారులు బౌర్తి గ్రామంలో ఈ దారిపెళ్లి చేశారు. వివరాల్లోకి వెళితే..ఆదివాసీ సంప్రదాయాలు, కట్టుబాట్లు భిన్నంగా ఉంటాయి. ఆదివాసీలు పూజలు, వివాహాలు, పండుగలు ఆసక్తికరంగా జరుపుకుంటారు. గిరిజన గ్రామాల్లో సాధారణంగా వివాహం జరిపేందుకు యువతీ, యువకుల రాశి ఫలాల ఆధారంగా స్థానిక గ్రామ దేవత పూజారి జాతకాలు పరిశీలించి  ముహూర్తం చూస్తారు. వివాహం కూడా ఆ పూజారులే నిర్వహిస్తారు. ఆదివాసీలు విభిన్న ఆచారాలతో వివాహాలను దేవాలయాలు, గృహాల్లో జరుపుకుంటారు. వధూవరుల జాతకాల్లో దోషాలు వుంటే దారిపెళ్లి జరిపించి పెళ్లి కుమారుడు గృహంలో మరుసటిరోజు విందు ఏర్పాటుచేస్తారు. కాగా మండలంలోని బౌర్తి గ్రామానికి చెందిన కాకరి నాగరాజు, పెండ్లిమామిడి గ్రామానికి చెందిన గెమ్మెలి సీతలకు వివాహం కుదిరింది. అయితే వధూవరుల జాతకాల్లో దోషాలు వున్నట్టు గ్రామ పూజారి కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వధూవరులకు గురువారం బౌర్తి గ్రామ రహదారిపై గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వివాహం జరిపించారు. శుక్రవారం బౌర్తిలోని వరుడు గృహంలో గ్రామ పెద్దలు విందు ఏర్పాటుచేశారు. ఈ దారిపెళ్లి చూసేందుకు స్థానికులు హాజరయ్యారు. 

Updated Date - 2020-03-13T11:30:44+05:30 IST