పది రోజులు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-03-04T10:04:00+05:30 IST

పది రోజులు బ్రేక్‌

పది రోజులు బ్రేక్‌

సీతారామపురంలో భూసేకరణ తాత్కాలికంగా వాయిదా

భూముల్లో పంటలను ధ్వంసం చేయడంతో సాగుదారుల ఆందోళన

సానుకూలంగా స్పందించిన నర్సీపట్నం ఆర్డీవో

పంట భూముల్లోనే సాగుదారులతో సమావేశం

పంటలు తీసుకోవడానికి పది రోజులు గడువు

ఇళ్ల స్థలాల కోసం ఆరు ఎకరాలు సేకరణ

మిగిలిన భూమిని సాగుదారులందరికీ పట్టాలు ఇస్తామని హామీ

శాంతించిన ఆందోళనకారులు


సీతారామపురం(రావికమతం), మార్చి 3: మండలంలోని దొండపూడి పంచాయతీ శివారు సీతారామపురంలో ఇళ్ల స్థలాలకు చేపట్టిన భూసేకరణ పనులను పది రోజులపాటు నిలిపివేయాలని నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈలోగా భూముల్లో వున్న పంటలను తీసేసుకోవాలని స్పష్టం చేశారు. మొత్తం 33 ఎకరాల్లో ఆరు ఎకరాలు మాత్రమే ఇళ్ల స్థలాలకు సేకరిస్తున్నామని, మిగిలిన భూమిని సాగుదారులందరికీ సమంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ మేరకు పట్టాలు ఇచ్చిన తరువాతే ఇళ్ల స్థలాలకు లేఅవుట్‌ పనులు చేపట్టాలని సాగుదారులు కోరారు. ఇందుకు ఆర్డీవో అంగీకరించడంతో సాగుదారులు ఆందోళన విరమించారు.


రావికతమం మండలం కొత్తకోటకు చెందిన పేదలకు దొండపూడి పంచాయతీ శివారు సీతారామపురంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.  ఇక్కడ సర్వే నంబరు 50లో రైతుల సాగులో ఉన్న 33 ఎకరాల ప్రభుత్వ గయాళ భూమిలో ఆరు ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు ఇటీవల చర్యలు చేట్టారు. పంటలకు వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టామని, పొలాల్లో వున్న పంటలు చేతికి వచ్చే వరకు ఆగాలని సాగుదారులు విజ్ఞప్తి చేశారు. కానీ అధికారులు వినలేదు. సోమవారం దాసరి ఈశ్వరావుకు చెందిన ఎకరా చెరకు తోటను రెవెన్యూ సిబ్బంది ధ్వంసం చేశారు. రెండు రోజులు గడువు కోరినా ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహించిన బాధిత రైతులతోపాటు మిగిలిన రైతులు కూడా సాగుభూమిలో దీక్షలకు దిగారు. అక్కడే వంటా-వార్పు చేసి నిరసన తెలిపారు. ఈ వార్త పత్రికల్లో రావడంతో నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి స్పందించారు. మంగళవారం దీక్షా శిబిరం వద్దవెళ్లి సాగుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు దాసరి ఈశ్వరావు, రమణమ్మ, భవాని, గాలి చిట్టెమ్మ తదితరులు మాట్లాడుతూ....70 ఏళ్ల నుంచి వారసత్వంగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇళ్ల స్థలాల కోసం బలవంతంగా స్వాఽధీనం చేసుకోవడం అన్యాయమన్నారు. ఈ భూముల్లో ప్రస్తుతం చెరకు, జనుము, వంగ, బెండ, బీర, తదితర పంటలు వున్నాయని, వీటిని తీసుకోవడానికి  గడువు కోరినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోకుండా యంత్రాలతో ధ్వంసం చేశారని వాపోయారు. భూమి తీసేసుకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. దీంతో తీవ్రంగా స్పందించిన ఆర్డీవో... ‘‘ ఈ భూములను మీవంటి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడానికి తప్ప, నా కోసం ఏమైనా తీసుకుంటున్నానా?’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పంట నష్టపరిహాం విషయయాన్ని జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళతానని, ఈ ఆరు ఎకరాలు వదులకుంటే మిగిలిన 27 ఎకరాలతోపాటు పక్కనే ఉన్న మరో సర్వే నంబరులోని 28 ఎకరాలను కలిపి, సాగుదారులందరికీ సమంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తొలుత పట్టాలు మంజూరు చేసి, తరువాత భూములు తీసుకోవాలని రైతులు కోరారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, పది రోజులపాటు  భూసేకరణ పనులు చేపట్టవద్దని రెవిన్యూ సిబ్బందిని ఆర్డీవో ఆదేశించారు. ఈ  సమావేశంలో తహసీల్దార్‌ కనకారావు, హెచ్‌డీటీ శ్రీనివాసు, సర్వేయర్‌ శర్మ, సామాజికవెత్త పులఖండం రమణాజీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-03-04T10:04:00+05:30 IST