పనితీరు బాగోకపోతే వలంటీర్లను తొలగిస్తాం

ABN , First Publish Date - 2020-12-30T05:51:39+05:30 IST

ఇళ్ల పట్టాల మంజూరుకు లబ్ధిదారుల ఎంపికలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనితీరు బాగోకపోతే వలంటీర్లను తొలగిస్తాం
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్చరిక     

వీఆర్‌వోలు, వలంటీర్ల పనీతీరును సమీక్షించాలంటూ అధికారులకు ఆదేశం

పద్మనాభం, డిసెంబరు 29: ఇళ్ల పట్టాల మంజూరుకు లబ్ధిదారుల ఎంపికలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు సరిగ్గా లేకపోతే వలంటీర్లను తొలగిస్తామని హెచ్చరించారు. మండలంలోని కృష్ణాపురం గ్రామంలో మంగళవారం పద్మనాభం, కృష్ణాపురం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు తమకు ఇళ్ల స్థలాలు,  రైతు భరోసా, అమ్మఒడి రాలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన వీఆర్వోలు, వలంటీర్లను వివరణ అడిగినా వారు సరైన కారణాలను చెప్పకపోవడంతో ఆగ్రహం వెలిబుచ్చారు. మామిడి రైతులకు రైతు భరోసా రాదని వలంటీర్‌ చెప్పడంతో మంత్రి కూడా అదే నిజమని నమ్మి, సదరు రైతుకు ఆ విషయాన్ని చెప్పారు. అయితే ఆ తర్వాత వాస్తవాన్ని తెలుసుకుని మంత్రినే తప్పుదోవ పట్టిస్తే ఎలాగంటూ అధికారులు, నాయకులపై ముత్తంశెట్టి మండిపడ్డారు. ఇటువంటి వారిని వలంటీర్లుగా ఎలా నియమించారంటూ నాయకులను నిలదీశారు. వలంటీర్ల పనితీరును నిరంతరం సమీక్షించాలని ఎంపీడీవోను, వీఆర్వోల విధి నిర్వహణపై సమీక్ష చేయాలంటూ తహసీల్దార్‌ను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పెంచల కిశోర్‌, ఎంపీడీవో జీవీ చిట్టిరాజు, తహసీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, వైసీపీ మండల అధ్యక్షుడు కె.రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.గిరిబాబు, యువ విభాగం అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు. 


పాఠశాల భవనాలు ప్రారంభం

మద్ది జడ్పీ పాఠశాలలో రూ.60 లక్షలతో నిర్మించిన అదనపు పాఠశాల భవనాలను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ భవనాల నిర్మాణంతో పాఠశాలకు పూర్తిస్థాయిలో వసతులు సమకూరాయన్నారు. 

Updated Date - 2020-12-30T05:51:39+05:30 IST