మూన్నాళ్లముచ్చటగా మారిన వలంటీర్ ఉద్యోగం.. 35 ఏళ్లు దాటితే..

ABN , First Publish Date - 2020-12-13T06:30:02+05:30 IST

వలంటీర్‌ ఉద్యోగం మూన్నాళ్లముచ్చటగా మారింది. 35 సంవత్సరాలు దాటితే ఉద్యోగం పోయినట్టేనని అధికార యంత్రాంగం చెబుతోంది.

మూన్నాళ్లముచ్చటగా మారిన వలంటీర్ ఉద్యోగం.. 35 ఏళ్లు దాటితే..
ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న వలంటీర్లు

వలం‘టియర్స్‌’

మూన్నాళ్ల ముచ్చటగా ఉద్యోగం

35 ఏళ్లు దాటితే ఉద్యోగం పోయినట్టే...

ముందస్తు నోటీస్‌ ఇవ్వడం వంటివి ఉండబోవంటున్న అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కొత్తగా గ్రామ/వార్డు వలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటుచేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ పనిచేస్తారు. వారికి నెలకు ఐదు వేలు గౌరవ వేతనం అందిస్తాం. ఈ విధంగా వేలాది మంది యువతీ,యువకలకు ఉపాధి కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదే...

- ఇదీ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు తరచూ చేసే ప్రకటన.


అయితే వలంటీర్‌ ఉద్యోగం మూన్నాళ్లముచ్చటగా మారింది. 35 సంవత్సరాలు దాటితే ఉద్యోగం పోయినట్టేనని అధికార యంత్రాంగం చెబుతోంది. గత ఏడాది ఆగస్టు నెలలో వలంటీర్ల నియామకం చేపట్టారు. అయితే అక్టోబరు రెండో తేదీ...గాంధీ జయంతి రోజు నుంచి గ్రామ/వార్డు వలంటీర్‌ వ్యవస్థ పనిచేయడం ప్రారంభమైంది. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు మధ్య యవతీయవకులకు వలంటీర్లగా అవకాశం కల్పించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించిన ప్రభుత్వం వారికి నెలకు ఐదు వేల గౌరవ వేతనం ఇస్తోంది. జిల్లాలో మొత్తం 12,285 మంది గ్రామ వలంటీర్లు పనిచేస్తున్నారు. ఇందులో 90 శాతం వరకు అధికార పార్టీ సానుభూతిపరులే ఉన్నారు. ఆ విషయం అలా వుంచితే...సాధారణంగా ప్రభుత్వ/ప్రైవేటు శాఖల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58-60 ఏళ్ల మధ్య ఉంటుంది. వలంటీర్లకు కూడా అదే నిబంధన వర్తించాలి. కానీ...వయోపరిమితిని 35 ఏళ్లకే పరిమితం చేశారు. ఉదాహరణకు ఒక వలంటీర్‌కు శనివారంతో 35 ఏళ్లు పూర్తయితే...సదరు వలంటీర్‌ ఈ నెలాఖరు తరువాత విధుల నుంచి వైదొలగాల్సిందే. జనవరి ఒకటి నుంచి అతనికి ఎటువంటి వేతనం అందదు. గత ఏడాది విధుల్లో చేరిన పలువురు వలంటీర్లకు 35 ఏళ్లు దాటడంతో ఈ నెల గౌరవ వేతనం నిలిచిపోయింది. దీంతో పలువురు...జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి వచ్చి ఆరా తీస్తున్నారు. 35 ఏళ్లు దాటితే గౌరవ వేతనం నిలిచిపోతుందని సదరు వలంటీర్లకు  అధికారులు స్పష్టంచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ముందస్తు నోటీస్‌ ఏమీ ఇవ్వబోమని, ఈ నెలలో 35 ఏళ్లు పూర్తయితే మరుసటి నెల నుంచి విధుల్లోకి రానవసరం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వలంటీర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 35 ఏళ్లకే తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-12-13T06:30:02+05:30 IST