విశాఖ సేఫ్‌.. ఎవరూ భయపడక్కర్లేదు

ABN , First Publish Date - 2020-04-08T17:08:53+05:30 IST

విశాఖపట్నం జిల్లా సేఫ్‌ జోన్‌లో వుందని, ప్రజలు ఎవరూ కరోనా వైరస్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభయమిచ్చారు

విశాఖ సేఫ్‌.. ఎవరూ భయపడక్కర్లేదు

ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మన దగ్గర కేసులు తక్కువే

పర్యాటక శాఖా మంత్రిముత్తంశెట్టి శ్రీనివాసరావు

అందుబాటులో 12 లక్షల మాస్కులు

వైద్యులు, నర్సుల భద్రతకు పినాకిల్‌ ఆస్పత్రిలో ఏర్పాట్లు

నర్సీపట్నం వైద్యుడిది బాధ్యతారాహిత్యం... చర్యలు


విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా సేఫ్‌ జోన్‌లో వుందని, ప్రజలు ఎవరూ కరోనా వైరస్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభయమిచ్చారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం ఐఏఎస్‌ అధికారులు, వైద్యాధికారులతో కలిసి ప్రభుత్వ అతిథి గృహంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ రెండో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే విశాఖపట్నంలో కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. 


వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, పరికరాలు లేవని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, అవన్నీ అవాస్తవాలని ఖండించారు. ప్రస్తుతం జిల్లాలో 10 లక్షల మెడికల్‌ మాస్కులు, రెండు లక్షల క్లాత్‌ మాస్కులు, ఇంకో 18 వేల ఎన్‌-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు. అవికాకుండా 4 లక్షల జతల హ్యాండ్‌ గ్లౌజులు, 1,299 పీపీఈలు, 22 వేల శానిటైజర్లు, 5 లీటర్ల శానిటైజర్‌ క్యాన్లు 8 వేలు, క్లినికల్‌ థర్మామీటర్లు 327 ఉన్నాయన్నారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వీటిని అందజేశామన్నారు. లాక్‌డౌన్‌ పీరియడ్‌ పూర్తయ్యేంత వరకు అవసరమైన నిల్వలు ఉన్నాయన్నారు. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, స్థానిక సంస్థలు, పంచాయతీలకు, డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి అవసరమైన అన్ని మాస్క్‌లు, పరికరాలు సరఫరా చేశామని, వాటిని క్షేత్రస్థాయి సిబ్బందికి అందించాలని సూచించారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది త్యాగనిరతితో విధులు నిర్వహిస్తున్నారని, వారి రక్షణ బాధ్యత పూర్తిగా తమదేనని స్పష్టంచేశారు. వారికి ఏమైనా అయితే చికిత్స చేసేందుకు పినాకిల్‌ ఆస్పత్రిలో అన్నిరకాల ఏర్పాట్లు చేశామన్నారు.  


ఆ వైద్యుడిది బాధ్యతారాహిత్యం

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని మంత్రి ఆరోపించారు. కొద్దిరోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే గణేశ్‌తో కలిసి తాను ఆస్పత్రి పనితీరుపై సమీక్షించగా, తాము పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ ఆస్పత్రిలో 13 మంది వైద్యులు వున్నారని, ఎన్‌-95 మాస్కులు 42, పీపీఈలు 82 అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన ఆ వైద్యుడి తీరుపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటారన్నారు.

Updated Date - 2020-04-08T17:08:53+05:30 IST