విశాఖ ప్రశాంతతను కాపాడుతా

ABN , First Publish Date - 2020-08-18T11:41:16+05:30 IST

విశాఖ ప్రశాంతతను కాపాడేందుకు తన వంతు కృషిచేస్తానని నూతన నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు.

విశాఖ ప్రశాంతతను కాపాడుతా

నేరాల నియంత్రణ,ట్రాఫిక్‌ సమస్యల

పరిష్కారానికిఅధిక ప్రాధాన్యం

పారదర్శకంగాకేసుల దర్యాప్తు

భూకబ్జాదారులు, రౌడీయిజంపై ఉక్కుపాదం నూతన సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా


విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): విశాఖ ప్రశాంతతను కాపాడేందుకు తన వంతు కృషిచేస్తానని నూతన నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఇప్పటివరకూ సీపీగా పనిచేసిన ఆర్కే మీనా నుంచి సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ లాంటి ప్రధాన నగరంలో కమిషనర్‌గా పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాఽధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. నగరంలో ట్రాఫిక్‌, నేరాల నియంత్రణకు అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ‘సృష్టి’ ఆస్పత్రిలో పిల్లల అక్రమ రవాణా వంటి కీలక కేసుల దర్యాప్తును గత సీపీ ఆర్కే మీనా మాదిరిగానే కొనసాగిస్తానన్నారు. త్వరలోనే అన్ని స్టేషన్లను సందర్శించి వాటి పనితీరును అంచనా వేయడంతోపాటు నగరంపై అవగాహన పెంచుకుంటానన్నారు. పరిపాలనా రాజధానిగా ఏర్పాటుకాబోతున్నందున నగరంలో భూ కబ్జాలు, రౌడీయిజం వంటివి లేకుండా కఠినంగా వ్యవహరిస్తానని మనీష్‌కుమార్‌ సిన్హా అన్నారు.


నూతన సీపీని కలిసి అభినందనలు తెలిపేందుకు సీఐ అంతకంటే పైస్థాయి అధికారులు రాగా ఏడీసీపీ స్థాయి అధికారులను మినహా మిగిలిన వారిని తరువాత కలుస్తానంటూ వెనక్కి పంపేశారు. అంతకుముందు పోలీస్‌ కమిషనరేట్‌కు చేరిన మనీష్‌కుమార్‌ సిన్హాకు గత సీపీ ఆర్కే మీనా స్వాగతం పలికారు. పోలీసులు పరేడ్‌ నిర్వహించగా గౌరవ వందనం స్వీకరించారు.


ఈ 13 నెలలు మర్చిపోలేను: ఆర్కే మీనా

సీపీగా పనిచేసి బదిలీపై వెళుతున్న ఆర్కే మీనా మాట్లాడుతూ తన 25 ఏళ్ల సర్వీసులో విశాఖలో పనిచేసిన 13 నెలల కాలం మర్చిపోలేనిదన్నారు. నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పోలీసింగ్‌ బలోపేతం కోసం తన ఆలోచనలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించానన్నారు. కరోనా విపత్తు, ఎల్జీ పాలీమర్స్‌ ప్రమాదం సమయంలో సమర్థంగా పనిచేయగలిగానన్నారు. విశాఖ ప్రజలు సౌమ్యులని, పోలీస్‌ అధికారులు ఏదైనా ఆదేశం ఇస్తే వాటిని పాటించడం ద్వారా తమ మద్దతును అందజేస్తారని కితాబిచ్చారు.

Updated Date - 2020-08-18T11:41:16+05:30 IST