విశాఖ చుట్టూ ప్రమాదకర పరిశ్రమలే!

ABN , First Publish Date - 2020-05-08T08:49:21+05:30 IST

విశాఖపట్నం ఆర్థిక రాజధానే కాదు..

విశాఖ చుట్టూ ప్రమాదకర పరిశ్రమలే!

ఫార్మా కంపెనీల్లో నిత్యం సంభవిస్తున్న ప్రమాదాలు 

ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు

భద్రతను పట్టించుకోని అధికారులు 


(ఆంధ్రజ్యోతి - విశాఖపట్నం, పరవాడ): విశాఖపట్నం ఆర్థిక రాజధానే కాదు.. పారిశ్రామిక రాజధాని కూడా. ఇక్కడ ఎన్ని భారీ పరిశ్రమలున్నాయో... అంతే సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. 1997లో హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌ ట్యాంకులు పేలినప్పుడు కూడా ఇప్పటిలాగే ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. నాటి ఘటనలో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల కిందట అదే కంపెనీలో కూలింగ్‌ టవర్‌ కూలిపోయి 38 మంది చనిపోయారు. స్టీల్‌ప్లాంట్‌లో 2012లో గ్యాస్‌ లీకై ట్యాంకర్‌ పేలిపోయి 19 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఫార్మా కంపెనీల గురించి చెప్పుకుంటే... అది నిరంతర మారణ హోమం. పరవాడ ఫార్మాసిటీ, నక్కపల్లి హెటిరో డ్రగ్స్‌, భీమిలి దివీస్‌ కంపెనీల్లో ప్రమాదాలు సంభవించడం.. ప్రాణాలు పోవడం రివాజుగా మారింది. వీటిపై జిల్లా అధికారులు కమిటీలు వేస్తున్నామని చెప్పడం, ఆ తరువాత వాటిని బుట్టదాఖలు చేయడం అలవాటుగా మారింది.  తాజాగా గోపాలపట్నం సమీప వెంకటాపురం ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో చోటు చేసుకున్న తరహా ప్రమాదాలు ఫార్మాసిటీలోని పలు కంపెనీల్లో గతంలో చాలా సంభవించాయి. వరుస ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 



ఫార్మాసిటీలో ప్రమాదాల పరంపర  

విశాఖ శివారు పరవాడలో ఫార్మాసిటీ ఉంది. గత ఏడేళ్లలో ఇక్కడ 30 వరకు ప్రమాదాలు జరిగాయి. సుమారు 40 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. కొన్ని కంపెనీల్లో ఓ పక్క నిర్మాణం జరుగుతుండగానే మరో మరో పక్క ఉత్పత్తి చేస్తున్నారు. ఎక్కువ శాతం కంపెనీల్లో భద్రత చర్యలు చేపట్టకపోవడం ప్రమాదాలకు దారి తీస్తోంది. గ్లోకెమ్‌ ఫార్మా కంపెనీ (ప్రస్తుతం టొరంటో ఫార్మా)లో మూడు సార్లు ప్రమాదాలు జరగడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు  కోల్పోయారు. సాయినార్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలిపోయి ఇద్దరు కార్మికులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. విష్ణు కెమికల్స్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు విడిచారు. ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఫార్మాసిటీకి ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.  


కాలుష్యంతో తాడి ఉక్కిరిబిక్కిరి

ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో భీతిల్లిపోతున్న ప్రజలకు కాలుష్యం తోడవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా ఫార్మాసిటీకి ఆనుకొని వున్న తాడి ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోతున్నారు. ఇప్పటికే భూగర్భజలాలు కలుషితం కావడంతో తాగునీటికి పడరాని పాట్లు పడుతున్నారు. భరించలేని దుర్వాసన వెదజల్లడంతో గ్రామంలో ఉండలేని పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు కాలుష్యానికి బలవుతున్నారు. ఎక్కువగా చర్మ, ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. తాడి గ్రామాన్ని అక్కడి నుంచి తరలించాలని స్థానికులు, అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఐదేళ్ల  కిందట ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. 


గ్రామానికి ఆనుకొని వున్న గ్రాన్యూల్స్‌, విజయశ్రీ ఆర్గానిక్స్‌, సీఎంటీ, మైలాన్‌ కంపెనీల్లో ప్రమాదాలు  సంభవించడంతో స్థానికులు పరుగులు తీసిన సందర్భాలు న్నాయి. 2017 మార్చిలో రాత్రి 10 గంటల సమయంలో గ్రాన్యూల్స్‌ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో తాడి ప్రజలంతా పరుగులు తీశారు.  ఆ రోజు జరిగిన ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదు. కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 


ఊరచెరువు కాలుష్యం 

ఫార్మా కాలుష్యం పరవాడ ఊరచెరువును కలుషితం చేస్తోంది. కొన్ని ఫార్మా కంపెనీలు ద్రవ వ్యర్థాలను నేరుగా చెరువులోకి విడిచిపెడుతున్నాయి. దీంతో జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. నీరు కలుషితం కావడంతో రైతులు తమ పొలాలకు నీటిని వినియోగించుకోవడం మానేశారు. దీంతో సుమారు 500 ఎకరాలు పంటలు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదే విషయాన్ని రైతులు ఇరిగేషన్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 


భయంతోనే గడుపుతున్నాం

ఫార్మాసిటీ పుణ్యమాని గత పదేళ్లుగా భయంతోనే కాలం వెల్లదీస్తున్నాం. తరచూ కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతుండడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. భూగర్భ జలాలన్నీ కలుషితమైపోయాయి. రోగాలతో తీవ్ర అవస్థలు పడుతున్నాం.

- నీలబాబు, మాజీ ఎంపీపీ, తాడిగ్రామం


భద్రత చర్యలు చేపట్టాలి

ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించాలి. భద్రత లేకపోవడంతో గత ఏడేళ్లలో 30 మందికిపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు. పటిష్ఠ భద్రతా చర్యలకు ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి, భద్రత పాటించని కంపెనీలను సీజ్‌ చేయాలి.

- గనిశెట్టి సత్యనారాయణ, సిటూ జిల్లా కార్యదర్శి 

  



Updated Date - 2020-05-08T08:49:21+05:30 IST