మూడు ముక్కలుగా విశాఖపట్నం జిల్లా!

ABN , First Publish Date - 2020-07-17T18:27:25+05:30 IST

ఏడాదిగా అనేక ఊహాగానాలు చెలరేగిన కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం..

మూడు ముక్కలుగా విశాఖపట్నం జిల్లా!

తెరపైకి మరోసారి కొత్త జిల్లాల ఏర్పాటు

విశాఖ, అనకాపల్లి, అరకులోయ కేంద్రాలుగా ఏర్పడే అవకాశం

తాజాగా సీఎస్ నేతృత్వంలో అధ్యయన కమిటీ వేసిన ప్రభుత్వం

ఎంపీ సెగ్మెంట్ల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు

ఎస్.కోటను విజయనగరంలోనే ఉంచాలని భావన

పెందుర్తి సెగ్మెంట్‌లోని పరవాడ, సబ్బవరం మండలాలపై పితలాటకం

అరకులోయ కన్నా పాడేరు జిల్లా కేంద్రం అయితే బాగుంటుందని అభిప్రాయం


విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి: ఏడాదిగా అనేక ఊహాగానాలు చెలరేగిన కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తారు. ఈ లెక్కన విశాఖ జిల్లా మూడుగా విభజన చేయనున్నారు. జిల్లాలో విశాఖ, అనకాపల్లి, అరకు పార్లమెంటరీ నియోజకవర్గాలున్నాయి. అనకాపల్లి తప్ప మిగిలిన రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో పొరుగు జిల్లాలకు చెందిన అసెంబ్లీ సెగ్మెంట్‌లున్నాయి. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు విశాఖ భిన్నమైనది. నగరం, మైదానం, ఏజెన్సీతో కూడిన జిల్లా కేంద్రానికి ఏజెన్సీ మండలాల నుంచి రావాలంటే ఎంతో శ్రమ పడాలి. సీలేరు నుంచి నగరానికి రావాలంటే ఒక రోజు పడుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం పాడేరు కేంద్రంగా జిల్లాగా ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన చాలాకాలం నుంచి ఉంది. ముఖ్యంగా ఏజెన్సీలో గిరిజన సంఘాలు కొన్నాళ్లు ఆందోళన చేపట్టారు. 


విశాఖ జిల్లా..

విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో గాజువాక, విశాఖ పశ్చిమ, దక్షిణ, ఉత్తర, తూర్పు, భీమిలి, ఎస్‌. కోట సెగ్మెంట్‌లున్నాయి. గాజువాక, విశాఖ పశ్చిమ, దక్షిణ, ఉత్తర, తూర్పు సెగ్మెంట్‌లు నగరంలో పూర్తిగా ఉన్నాయి. భీమిలిలో సగం నగర పరధిలో ఉంది. ఇక ఎస్‌. కోట విజయనగరం జిల్లాలో ఉంది. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తే ఎస్‌. కోట తప్ప మిగిలిన ఆరు సెగ్మెంట్‌లలో ప్రజలకు ఇబ్బందిలేదు. ఎస్‌. కోట అసెంబ్లీ సెగ్మెంట్‌ విజయనగరం జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంది. ఎస్‌. కోటలో గంట్యాడ మండలం గజపతినగరం ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాంతం ప్రజలు విశాఖ రావాలంటే విజయనగరం దాటి రావాలి. దీనిపై అక్కడ ప్రజలు వ్యతిరేకించవచ్చు. జనాఢా పరంగా నగరంలోనే 24 లక్షల వరకు జనాభా ఉన్నారు. భీమిలి కలిపితే రమారమి 27లక్షలకు చేరవచ్చు. ఎస్‌. కోట మినహాయించినా ఆరు సెగ్మెంట్‌లతో విశాఖ జిల్లా సౌలభ్యంగా ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. 


అనకాపల్లి జిల్లా:

అనకాపల్లి లోక్‌సభ పరిధిలో పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అసెంబ్లీ సెగ్మెంట్‌లున్నాయి. దీంట్లో పెందుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌లో పెందుర్తి, సుజాత నగర్‌, వేపగుంట వంటి ప్రాంతాలు జీవీఎంసీ పరిధిలో ఉంది.ఇక్కడ ప్రజలు అనకాపల్లి కంటే విశాఖ జిల్లా అయితే పాలనాపరంగా సౌలభ్యంగా ఉంటుంది. ఎందుకంటే జీవీఎంసీ పరిధిలోకి ఈ ప్రాంతాలు వస్తాయి. అయితే పెందుర్తిలో సబ్బవరం, పరవాడ మండలాలు అనకాపల్లికి దగ్గరగా ఉన్నందున ఈ రెండు మండలాలను అనకాపల్లి జిల్లాలో చేర్చినా ఇబ్బందిలేదు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత భాగం పాడేరుకు దగ్గరలో ఉంది. కాగా అనకాపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్‌, ఇతర పారిశ్రామిక ప్రాంతం దాని పరిధిలోకి వస్తాయి. 


అరకు జిల్లా..

అరకు పార్లమెంటరీ నియోజకవర్గం భౌగోళికంగా ఎంతో భిన్నమైనది. తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడరం నుంచి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ వరకు మొత్తం నాలుగు జిల్లాల్లో ఏజెన్సీలో విస్తరించింది. అరకు లోక్‌సభను ఒక జిల్లాగా చేయడం సాధ్యంకాదు. రంపచోడవరం, పాలకొండ, పార్వతీపురం, కురుపాం ప్రజలు అరకు రావాలంటే కనీసం మూడు నుంచి నాలుగు బస్సులు మారాలి. .. అది కూడా కనీసం ఒక రోజు ప్రయాణం పడుతుంది. పాలనా సౌలభ్యం కోసం విశాఖ జిల్లాలో పాడేరు, అరకు సెగ్మెంట్‌లను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటుచేసి మాడుగుల సెగ్మెంట్‌, ఎస్‌. కోటలో గిరిజన ప్రాంతాలు కలిపితే సరిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే విశాఖ ఏజెన్సీలో 11 మండలాలున్నాయి. కొయ్యూరు నుంచి అనంతగిరి వరకు సుదూర ప్రాంతంలో మరికొన్ని మండలాలు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన ఉంది. జనాభాను కాదని భౌగోళికంగా తీసుకుంటే విశాఖ ఏజెన్సీలో 11మండలాలను అరకు/ పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలని కొందరు వాదన. 


విశాఖ జిల్లా ప్రస్తుతం..

2011 జనాభా లెక్కల మేరకు విశాఖ జిల్లా జనాభా. 42.90 లక్షలు. గడచిన పదేళ్లలో జనాభా మరో నాలుగైదు లక్షలు పెరగవచ్చునని అంచనావేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు రెవెన్యూ డివిజన్లు, 46 మండలాలున్నాయి. 


Updated Date - 2020-07-17T18:27:25+05:30 IST